How to Do Abhishekam on Shivaratri: మహా శివరాత్రి రోజున ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతాయి. బిల్వపత్రార్చనలు, రుద్రాక్ష మాలాధారణలు, రుద్రాభిషేకాలు, విభూతి ధారణతో భక్తులు శివయ్య అనుగ్రహం కోసం వేడుకుంటారు. అయితే శివరాత్రి ఈ సందర్భంగా ఆ రోజున కొన్ని ద్రవ్యాలతో శివుడిని అభిషేకించడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
పుష్ప జలం: చాలా మందికి సొంత ఇళ్లు నిర్మించుకోవాలని ఉంటుంది. అయితే ఇల్లు లేదా అపార్ట్మెంట్ కొనుగోలు చేయాలనుకునే వారు మహా శివరాత్రి రోజు కొన్ని నీళ్లలో పూలు ఉంచి, ఆ పుష్ప జలంతో శివుడికి అభిషేకం చేయాలి. అలాగే నవరత్న జలాలతో అభిషేకం చేయాలి. ఇలా అభిషేకం చేయడం వల్ల గృహ యోగం త్వరగా కలుగుతుందని అంటున్నారు.
ఆవు పెరుగు: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆవు పెరుగుతో శివాభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. అయితే అభిషేకం చేసే సమయంలో 'బాలాంబికేశ! వైద్యేశ! భవరోగ హరేతిచ!' మూడు నామాలు తప్పకుండా చదువుకోవాలని సూచిస్తున్నారు. ఆవుపాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయని వివరిస్తున్నారు. ఆవు నెయ్యితో శివాభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుందని సూచిస్తున్నారు.
గంధం: పెళ్లై సంవత్సరాలు గడిచినా పిల్లలు లేని వారు శివుడికి గంధం కలిపిన నీళ్లు అభిషేకం చేయాలి. ఇలా చేస్తే సంతానయోగం కలుగుతుందని అంటున్నారు.
తేనె: మహా శివరాత్రి నాడు పరమేశ్వరుడికి శివాభిషేకం చేస్తే కళా రంగంలో అద్భుతంగా రాణించవచ్చని, సంగీత నాట్య రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని చెబుతున్నారు.
ఈ అభిషేకాలు చేసినా విశేష ఫలితాలు:
- పంచదార కలిపిన నీటితో శివాభిషేకం చేస్తే అన్ని కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చని చెబుతున్నారు.
- చెరకు రసంతో శివయ్యకు అభిషేకం చేస్తే ధనవృద్ధి కలుగుతుందని, అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుందని వివరిస్తున్నారు.
- కొన్ని నీళ్లలో వేసి రుద్రాక్షలు శివరాత్రి రోజు ఆ జలంతో అర్ధనారీశ్వరుడికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పేర్కొంటున్నారు.
- విభూతి కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని చెబుతున్నారు.
- మారేడు దళాలను కొన్ని నీళ్లలో కలిపి ఆ జలంతో శివాభిషేకం చేస్తే భోగ భాగ్యాలు కలుగుతాయని వివరిస్తున్నారు.
- శివుడిలో ఐక్యం అయిపోవాలి, మోక్షం కావాలనుకునేవారు నేరేడు పండ్ల రసంతో శివాభిషేకం చేయాలని చెబుతున్నారు.
- కార్యసిద్ధి లభించాలంటే ద్రాక్ష పండ్ల రసంతో, శత్రు బాధలు తొలగిపోవడానికి ఖర్జూర పండ్ల రసంతో శివాభిషేకం చేయాలని సూచిస్తున్నారు.
- అపమృత్యు దోషాలు, గండాలు తొలగిపోవడానికి శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలని చెబుతున్నారు.
- బొప్పాయి పండ్ల రసంతో అభిషేకం చేస్తే జాతక చక్రంలో అవయోగాలు, దోషాలు తొలగిపోతాయని అంటున్నారు.
- గరికపోచలు కలిపిన నీటితో అభిషేకం చేస్తే పోగొట్టుకున్న సంపదలన్నీ తిరిగి సొంతమవుతాయని చెబుతున్నారు.
- శివరాత్రి రోజు అన్నంతో అభిషేకం చేస్తే అధికార ప్రాప్తి కలుగుతుందంటున్నారు.
- చక్రవర్తిత్వం కలగాలంటే కస్తూరిని నీళ్లలో కలిపి, ఆ జలంతో అభిషేకం చేయాలట.
- మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకునే వారు వెన్నతో, అప్పుల బాధ తీరడానికి బియ్యం పిండి కలిపిన నీళ్లతో శివాభిషేకం చేయాలని సూచిస్తున్నారు.
- కుంకుమ పువ్వు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే అద్భుతమైన సౌందర్యం సిద్ధిస్తుందని, అదృష్టం వరిస్తుందని అంటున్నారు.
మహాశివరాత్రి అసలైన ముహూర్తం ఎప్పుడు? - పవిత్ర లింగోద్భవ సమయం ఇదే! - ఇలా పూజించాలి!
ఈ శివరాత్రికి "మహా ఆదియోగి" దర్శనం - తెలుగు భక్తులు ఇలా వెళ్లొచ్చు!