Habits That Damage Brain Health :అత్యద్భుతమైన మానవ మేథస్సుకు మూలమైన మెదడును.. కొన్ని అలవాట్లతో ఎవరికి వారే దెబ్బ తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాట్లను త్వరగా మానుకోకపోతే అల్జీమర్స్ వంటిమెదడు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ నివేదిక ప్రకారం మెదడుపనితీరు దెబ్బతినడానికి ఐదు ప్రధాన కారణాలున్నాయి.
ఎక్కువ సేపు కూర్చోవడం :
"పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ వన్" 2018లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట. ఇలా కూర్చోవడం వల్ల.. మెదడులో ఉండే మీడియల్ టెంపోరల్ లోబ్ (medial temporal lobe(MTL)) సన్నగా మారుతుందని పరిశోధకులు గుర్తించారు. కాబట్టి.. రోజూ కనీసం చెమట వచ్చేలా 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని చెబుతున్నారు.
ఒంటరిగా ఉండటం :
నలుగురితో కలిసి మాట్లాడకుండా ఒంటరిగా ఉండే వారిలో అల్జీమర్స్ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందట. 2021లో The Journals of Gerontology ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఒంటరిగా ఉండేవారు మిగతా వ్యక్తులతో పోల్చి చూస్తే చురుకుగా లేరని పరిశోధకులు వెల్లడించారు. వీరు నిత్యం ఏదో ఆలోచిస్తూ.. బాధపడుతూ మెదడుకు అతిగా పని కలిగిస్తారు. దీంతో.. బుర్ర వేడెక్కిపోతుంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే మంచిది కాదు. అందుకే.. ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం చేసి ఒంటరితనాన్ని దూరం చేసుకోవాలని సూచిస్తున్నారు.
నిద్రలేమి :
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నివేదిక ప్రకారం.. పెద్దలలో మూడింట ఒక వంతు మంది ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోవడం లేదట. దీనివల్ల వారిలో జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఆలోచన సామర్థ్యం దెబ్బతినడం, నిద్రలేమి వంటి ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయని తేలిందిట. కాబట్టి, ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా నిద్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నారు.
దీర్ఘకాలిక ఒత్తిడి :
ప్రస్తుత కాలంలో చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. ఇలా దీర్ఘకాలికంగా ఒత్తిడికి లోనవడం వల్ల కూడా మెదడు పనితీరు దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. స్ట్రెస్‌ను తగ్గించుకోవడానికి రోజూ యోగా, ధ్యానం వంటి వాటిని ప్రాక్టీస్ చేయాలని సూచిస్తున్నారు.