Side Effects of Uterus Removing:గర్భసంచి తొలగించడం ఈ రోజుల్లో సర్వసాధారణమైంది. కొందరు వైద్యులు డబ్బు కోసం భయపెట్టి ఆపరేషన్లు చేస్తుండగా.. మరికొందరు అమాయకంగా తీయించుకుంటున్నారు. ఇంకొందరైతే.. పిల్లలు పుట్టిన తర్వాత గర్భసంచితో పని ఏమీ ఉండదని, అది తొలగిస్తేనే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని భావిస్తుంటారు. కానీ.. గర్భాశయం తొలగిస్తే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గర్భసంచి, అండాశయాలు, అండవాహికలు.. ఈ మూడూ కలిసి పునరుత్పత్తి వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. మహిళలకు కీలకమైన ఈస్ట్రోజన్ సహా ఇక్కడ ఉత్పత్తి అయ్యే పలు రకాల హార్మోన్లు శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తాయి. మెదడు, గుండె పనితీరుతో పాటు, ఎముక గట్టితనం, పోషకాల శోషణ(Absorbtion), రక్తపోటు నియంత్రణ, జీవక్రియల క్రమబద్ధీకరణ వంటి పనులను ఈ హార్మోన్లు చేస్తాయి. ఈ కారణంగానే 50 ఏళ్లలోపు పురుషులతో పోలిస్తే.. మహిళల్లో బీపీ, షుగర్ బాధితులు తక్కువగా ఉంటారు. ఇలాంటి గర్భసంచి తొలగిస్తే.. ఆరోగ్యం ఎన్నో విధాలుగా దెబ్బ తింటుందని చెబుతున్నారు.
రక్తం గడ్డ కడుతుంది :గర్భాశయ శస్త్రచికిత్స సమయంలో చాలా మందికి అధిక రక్తస్రావం జరుగుతుంది. ఈ పరిస్థితి రక్తహీనతకు కారణమవుతుంది. కొంతమంది రోగులలో ఈ రకమైన శస్త్రచికిత్స రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుందట. ఈ రక్తం గడ్డకట్టడం మొదలైతే కాళ్లు, ఊపిరితిత్తుల వంటి ముఖ్యమైన అవయవాలపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు.
క్యాన్సర్:లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచిని తొలగించడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. ఈ క్యాన్సర్ కణాలు శరీరం అంతటా ఊహించని విధంగా వ్యాప్తి చెందుతాయని.. తద్వారా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని అంటున్నారు.
శ్వాసకోస సమస్యలు:శస్త్రచికిత్స సమయంలో అనస్థీషియా ఇస్తారు. ఇది కొంతమంది మహిళల్లో శ్వాస సమస్యలు, గుండె సమస్యలను కలిగిస్తుందని.. ముఖ్యంగా ఆస్తమా ఉన్న స్త్రీలలో, 50 ఏళ్లు దాటిన వారిలో ఈ సమస్యలు అధికమవుతాయని అంటున్నారు.
ఇన్ఫెక్షన్: సర్జరీ సమయంలో శరీరంలోని అంతర్గత అవయవాలకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఇన్ఫెక్షన్ వెంటనే అనేక ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తుందని చెబుతున్నారు. అలాగే శరీరం నుంచి గర్భాశయాన్ని తొలగించేటప్పుడు, సమీపంలోని అవయవాలకు గాయం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని.. గాయం స్వభావాన్ని బట్టి అది నయం కావడానికి చాలానే సమయం పట్టవచ్చంటున్నారు.