How Many Litres of Water to Drink: మన శరీరంలో సగానికి పైగా నీటితో నిండి ఉంటుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు. నీళ్లు తాగడం వల్ల అందం, ఆరోగ్యం, ఫిట్‌నెస్ పెరుగుతుందని లీటర్ల కొద్దీ నీళ్లు తాగుతుంటారు కొంతమంది. అయితే నీళ్లు ఎక్కువగా తాగడం మంచిదే అయినా.. ఇదీ మోతాదులోనే ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజుకు ఎన్ని లీటర్లు నీళ్లు తాగాలో తెలుసుకుందాం.
మహిళలు ప్రతి రోజు సగటున 2.7 లీటర్ల నీళ్లు తాగడం మంచిదని 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' వెల్లడించింది. అయితే కొంతమంది ఈ మోతాదుకు మించి నీళ్లు తాగుతుంటారు. దీని వల్ల కిడ్నీలు బయటికి పంపించగా మిగిలిన నీటిలోని సోడియం గాఢత రక్తంలోకి చేరి.. కణజాలాల వాపునకు కారణమై Hyponatremia అనే వ్యాధి వస్తుందని నిపుణులు అంటున్నారు. ఒక్కొసారి ఈ వాపు మెదడు కణజాలాల్లోనూ రావచ్చని హెచ్చరిస్తున్నారు. తద్వారా మూర్ఛ వంటి సమస్యలతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదమూ ఉందంటున్నారు. Annals of Pediatric Endocrinology & Metabolism జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో ఈ విషయం తేలింది. a case of symptomatic hyponatremia caused by excessive water intake అనే అంశంపై చేపట్టిన అధ్యయనంలో Chosun University School of Medicine in Korea డాక్టర్ Min A Joo పాల్గొన్నారు.
ఎలా తెలుసుకోవచ్చు?
శరీరంలో నీటి స్థాయులు పెరిగాయన్న విషయం కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అయితే వీటిలో కొన్ని లక్షణాలు శరీరంలో నీటి స్థాయులు తగ్గినప్పుడు కూడా గమనించచ్చని అంటున్నారు. అందుకే డాక్టర్‌ని సంప్రదించి శరీరంలో నీటి స్థాయులు పెరిగాయా? తగ్గాయా? అనే విషయం మొదట తేల్చుకొని.. ఆపై వాళ్లు సూచించిన సలహాలు పాటిస్తే ఫలితం ఉంటుందని సలహా ఇస్తున్నారు. ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- తలనొప్పి
- కడుపు నొప్పి
- కండరాల బలహీనత
- కడుపు ఉబ్బరం
- వాంతులు, వికారం
- నీరసం, అలసట,
- పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావడం
- మూత్రం పూర్తిగా తెలుపు రంగులో లేదా పారదర్శకంగా కనిపించడం
- చేతులు, కాళ్లు, ముఖంలో వాపు
కారణాలేమిటి?
మనలో చాలా మంది ఆరోగ్యానికి మంచిదని లీటర్ల కొద్దీ నీళ్లు తాగుతుంటారు. అయితే కేవలం నీరు ఎక్కువగా తాగడం వల్లే శరీరంలో నీటి మోతాదు పెరగదని.. దీనికి ఇతర కారణాలూ ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
- ఎండలో తిరిగినప్పుడు ,ఆటలు ఆడేటప్పుడు, వ్యాయామాలు చేసేటప్పుడు చెమట ఎక్కువగా వస్తుంటుంది. ఫలితంగా శరీరంలో నీటి స్థాయులు తగ్గకుండా ఎక్కువ నీళ్లు తాగుతుంటాం. ఇది కూడా ఒక దశలో వాటర్ ఇన్‌టాక్సికేషన్‌కు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- స్కిజోఫ్రేనియా సమస్యతో బాధపడే వారిలో ‘Polidipsia’ అనే మానసిక సమస్య ఉంటుందట! దీనివల్ల కూడా దాహం ఎక్కువగా వేయడం, సమయం చూసుకోకుండా నీళ్లు, ఇతర ద్రావణాలు ఎక్కువగా తీసుకుంటారని నిపుణులు అంటున్నారు. ఫలితంగా శరీరంలో మోతాదుకు మించి నీటి స్థాయులు పెరుగుతాయని చెబుతున్నారు.
- మనం వివిధ వ్యాధులకు వేసుకునే కొన్ని రకాల మందులు కూడా దాహాన్ని ప్రేరేపిస్తాయని.. ఫలితంగా నీళ్లు ఎక్కువగా తాగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇవి కూడా వాటర్ ఇన్‌టాక్సికేషన్‌కు ఓ కారణమే కావొచ్చని అంటున్నారు నిపుణులు.
- మన శరీరంలో నీటి స్థాయులు సరిగ్గా ఉన్నాయా, లేదా అనే విషయం కిడ్నీల పనితీరుపై కూడా ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. దీర్ఘకాలిక మూత్ర పిండాల సమస్యలు, కాలేయ వ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలున్న వారిలో సరైన మోతాదులో నీళ్లు, విషతుల్యాలు బయటికి వెళ్లిపోకపోవడం వల్ల కూడా శరీరంలో నీటి స్థాయులు పెరుగుతాయని వివరించారు.