How Much Salt You Should Consume in a Day : వంట రుచిని పెంచడంలో ఉప్పు ఎంతటి కీలకపాత్ర పోషిస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే, అతిగా తింటే మాత్రం ఆరోగ్యం దెబ్బ తింటుంది. నిజానికి మనం తినే కూరగాయలు, మాంసాలు, పండ్లు, తృణధాన్యాలు వీటన్నింటిలోనూ ఎంతోకొంత సోడియం ఉంటుంది. అది పట్టించుకోకుండానే చాలా మంది గట్టిగా ఉప్పు దట్టిస్తారు.
దీనివల్ల కిడ్నీ, బీపీ సమస్యలతోపాటు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అందుకే వీలైనంత వరకు ఉప్పును తగ్గించాలని చెబుతుంటారు వైద్యులు. అయితే, ఉప్పు తగ్గించాలని తెలుసుగానీ, ఎంత తినాలో మాత్రం చాలా మందికి తెలియదు. అందుకే, వయసు ప్రకారం ఎంత ఉప్పు తినాలో నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఏడాది లోపు వయసున్న పిల్లల్లో కిడ్నీలు ఇంకా అభివృద్ధి చెందే స్టేజ్‌లోనే ఉంటాయి. అందుకే వాళ్లు తినే ఆహారంలో ఉప్పు అసలు చేర్చకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, సోడియం కూడా బాడీకి కావాల్సిన పోషకాల్లో ఒకటి. అది సంవత్సరంలోపు ఉన్న చిన్నారులకు తల్లిపాలు, ఫార్ములాల్లో దొరుకుతుందని చెబుతున్నారు.
1 నుంచి 3 ఏళ్లు : ఈ ఏజ్ పిల్లలకు డైలీ 0.8 గ్రాముల సోడియం కావాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ల తీసుకునే ఆహారంలో రెండు గ్రాముల వరకూ ఉప్పును వాడొచ్చంటున్నారు.
5 ఏళ్ల లోపు : వీరు తీసుకునే ఆహారంలో 3 గ్రాముల వరకు సాల్ట్ యూజ్ చేయవచ్చట.
10 నుంచి 18 ఏళ్లు : ఈ ఏజ్ గ్రూప్ వాళ్లు తమ రోజువారీ ఆహారంలో 5 గ్రాముల వరకు ఉప్పును తీసుకోవచ్చట.
18 ఏళ్లు నిండిన వారు : ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం 18 సంవత్సరాలు దాటిన వారంతా తమ డైలీ డైట్లో 7 నుంచీ 12 గ్రాముల వరకు ఉప్పు తినొచ్చట.
అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా? - మీ సాల్ట్ ఇలా టెస్ట్ చేసుకోండయ్యా!
65 ఏళ్లు దాటిన వారు : ఇకపోతే 65 సంవత్సరాలు వచ్చాక మాత్రం, వారివారి ఆరోగ్య పరిస్థితులరీత్యా ఉప్పును ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. అయితే, ఏదేమైనప్పటికీ అతిగా ఉప్పు వాడకం మాత్రం ఆరోగ్యానికి హానికరం అనే విషయం మర్చిపోవద్దని హెచ్చరిస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం జరిపిన ఓ రీసెర్చ్‌లోనూ రోజూ వారి ఆహారంలో 3 నుంచి 5 గ్రాముల వరకు ఉప్పు తీసుకోవడం మంచిదని తేలిందట. (ఇందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.) తద్వారా రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధుల ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చని అంచనా వేశారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభించాలంటే - ఉప్పును ఇలా తీసుకోవాలంటున్న నిపుణులు!