How to Reduce Salt Intake: ఎంత మంచి వంటకమైనా సరే.. ఉప్పు లేకుంటే రుచిగా ఉండదు. ఉప్పు, కారం సరిగ్గా ఉంటేనే దాని రుచి మరింత పెరిగి.. మన జిహ్వకూ రుచిస్తుంది. కానీ, కొంతమంది వీటి మోతాదుకు మించి వాడుతుంటారు. ఫలితంగా ఉప్పు వాడకం మితిమీరి బీపీ, హైపర్‌టెన్షన్, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అందుకే ఉప్పును తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలను, ప్రత్యామ్నాయ మార్గాలను పాటించాలని సూచిస్తున్నారు. ఉప్పు వాడకం తగ్గించడం వల్ల రక్త పోటు తగ్గుతుందని 2017లో Journal of the American College of Cardiologyలో ప్రచురితమైన "The effects of sodium reduction on blood pressure in individuals with hypertension" అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలోనే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
- మనలో చాలా మందికి జామ పండు, పచ్చి మామిడి కాయ, మొక్కజొన్న వంటి వాటిపై ఉప్పు చల్లుకొని తినే అలవాటు ఉంటుంది. అయితే ఇలాగే తినాలని ఇష్టపడే వారు ఉప్పుకి బదులుగా నిమ్మ పొడి (నిమ్మతొక్కలను ఎండబెట్టి చేసే పొడి), ఆమ్‌చూర్ పొడి (మామిడి కాయల్ని ఎండబెట్టి చేసే పొడి), వాము, మిరియాల పొడి, ఒరెగానో వంటి వాటిని ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చని అంటున్నారు. ఫలితంగా ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
- కొంత మంది కూరలు వండుకునేటప్పుడు ముందే కారంతో పాటు ఉప్పు కూడా వేసేస్తుంటారు. కానీ అలా కాకుండా కూర పూర్తిగా ఉడికిన తర్వాత.. దానిపై నుంచి కాస్త ఉప్పు చల్లినా రుచికి సరిగ్గా సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
- ముఖ్యంగా సాస్‌లు, నిల్వ పచ్చళ్లు మొదలైన వాటిలో ఉప్పు మోతాదుకు మించి ఉంటుంది. అయితే, ఇలాంటివి అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని అంటున్నారు. కాబట్టి ఇలాంటి పదార్థాలు తీసుకోవడం బాగా తగ్గించాలని సూచిస్తున్నారు.
- ఇంకా పెరుగు, సలాడ్స్, పండ్లు వంటి వాటిలో కూడా ఉప్పు చల్లుకొని తినడం కంటే నేరుగా తినడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తేనే వాటిలోని అసలు రుచి తెలుస్తుందని అంటున్నారు. ఇదే కాకుండా అలాగే ఉప్పునూ తగ్గించుకున్నట్లు అవుతుందని వివరిస్తున్నారు.
- ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి స్థాయులు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ముఖం, పొట్ట, ఇతర శరీర భాగాలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయని హెచ్చరిస్తున్నారు. అందుకే ఉప్పు మోతాదును క్రమంగా తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.
- ముఖ్యంగా మనలో చాలామంది డైనింగ్ టేబుల్‌పై ఉప్పు డబ్బా ఉంచుతారు. అలాగే కొంతమంది తినేటప్పుడు తప్పకుండా ఉప్పు డబ్బాను తమ వెంటే ఉంచుకుంటారు. ఇలా చేయడం వల్ల కూడా ఎక్కువ ఉప్పు తీసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఈ అలవాటును మానుకోవడం వల్ల ఉప్పు వినియోగాన్ని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.
- ఒకవేళ ఇప్పటికే బీపీ, హైపర్‌టెన్షన్, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే.. రోజుకు ఎంత ఉప్పు తీసుకోవాలో వైద్యులను అడిగి తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు. వారు మీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ఎంత మోతాదులో తీసుకోవచ్చో సూచిస్తారని తెలిపారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
నల్లద్రాక్షతో గుండె జబ్బులు, క్యాన్సర్‌కు చెక్- కానీ వారు మాత్రం ఎక్కువగా తినకూడదట
కొబ్బరి నూనెతో లేడీస్ ప్రాబ్లమ్‌కు చెక్- సింపుల్ టిప్స్ పాటిస్తే హర్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయట!