Daily Bathing is Good for Health or Not: మనలో చాలా మంది ప్రతి రోజూ తప్పనిసరిగా స్నానం చేస్తుంటారు. దుర్వాసన వస్తుందని కొందరు, ఉదయాన్నే లేచిన తర్వాత కాలకృత్యాల్లో భాగంగా మరికొందరు స్నానం చేస్తుంటారు. అయితే, ఇది ప్రాంతాలను బట్టి మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో మూడింట రెండితల మంది రోజూ స్నానం చేస్తుండగా.. ఆస్ట్రేలియాలో 80శాతం మందే చేస్తున్నారు. కానీ చైనాలో సగానికి పైగా మంది వారానికి రెండు సార్లు మాత్రమే స్నానం చేస్తుంటారు. భారతదేశంలో అయితే చాలా మంది తప్పనిసరిగా రోజూ స్నానం చేస్తుంటారు. మరి ఇలా రోజూ స్నానం చేయడం మంచిదేనా? తరచూ స్నానం చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మన చర్మాన్ని కాపాడేందుకు నూనెతో కూడిన ఒక పొర ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా చర్మంపై మంచి బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు కూడా ఉంటాయని వివరిస్తున్నారు. కానీ, తరచూ స్నానం చేస్తూ రుద్దడం వల్ల ఇవి తొలగిపోయే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా వేడి నీటితో స్నానం చేస్తే ఇది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వివరిస్తున్నారు. దీంతో చర్మం పొడిగా, అసౌకర్యంగా మారి దురద పెడుతుందని తెలిపారు. ఇంకా పొడి చర్మం వల్ల పగుళ్లు ఏర్పడి చెడు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఫలితంగా చర్మ సమస్యలు, అలర్జీలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 2018లో Journal of Investigative Dermatologyలో ప్రచురితమైన "The effects of daily bathing on the skin's natural moisture barrier" అనే అధ్యయనంలో తేలింది. ఇంకా హార్వర్డ్ హెల్త్ పబ్లికేషన్ రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
స్నానం చేసే సమయంలో వాడే యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులు.. మంచి బ్యాక్టీరియాను చంపేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది చర్మంపై ఉన్న స్మూక్షకణాలను తొలగించి వాటి సమతుల్యతను దెబ్బతీస్తుందని వివరిస్తున్నారు. ఇవి మన రోగ నిరోధక శక్తి పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే కొందరు పిల్లల, చర్మ వైద్యులు రోజూ స్నానం చేయించకూడదని సూచిస్తుంటారని తెలిపారు. తరచూ స్నానం చేయడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ పనితీరు తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు.
తరచూ స్నానం చేసుకుని శరీరాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పక్కనపెడితే చర్మ సమస్యలు వస్తాయని వివరిస్తున్నారు. స్నానం చేసే క్రమంలో వాడే నీటితో పాటు నూనెలు, సబ్బులు, షాంపూలతో అలర్జీలు వస్తాయని అంటున్నారు. ఇంకా స్నానం చేసే నీటిలో ఉండే ఉప్పు, ఖనిజాలు, క్లోరిన్, ఫ్లోరైడ్ వంటి రసాయనాలు వల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.
మరి ఎన్ని రోజులకు స్నానం చేయాలి?
స్నానం చేయడానికి ఒక నిర్దిష్టమైన వ్యవధి లేదని నిపుణులు చెబుతున్నారు. కొందరు వైద్యులు రోజూ చేయాలని.. మరికొందరు వారానికి రెండు, మూడు సార్లు సరిపోతుందని అంటుంటారు. ఇది వ్యక్తి శరీర స్థితి, జీవనశైలిని బట్టి మారుతుందని వివరిస్తున్నారు. ఆఫీసుల్లో చల్లగా కూర్చునేవారితో పోలిస్తే ఎండకు తిరుగుతూ చెమటలు పట్టేవారు ఎక్కువ సార్లు చేయాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.
ఎంత సేపు స్నానం చేయాలి?
మనలో కొందరు చాలా ఎక్కువ సమయం పాటు స్నానం చేస్తుంటారు. నీటిలో ఎక్కువ సమయం గడపడం వల్ల చర్మంతోపాటు జుట్టు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. సుమారు 3-5 నిమిషాల స్నానం చేస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. శరీరంలోని ప్రతీ ప్రదేశాన్ని రుద్దుతూ ఉండకుండా.. ముఖ్యంగా చంకలు, ముఖం లాంటి ప్రదేశాలపై దృష్టి పెట్టాలని సలహా ఇస్తున్నారు. మనం చేసే నీరు కూడా చర్మంపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు. బయట చల్లగా ఉందని.. వేడి నీటితో స్నానం చేస్తుంటారు చాలా మంది. ఇలా చేయడం వల్ల చర్మం త్వరగా పొడిగా మారి దురద పెడుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే వీలైనంతర వరకు గోరు వెచ్చటి నీటితో చేయాలని వివరిస్తున్నారు.
రోజూ షాంపూ పెట్టాలా?
ప్రతి రోజూ షాంపూ పెట్టాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. చాలా రకాల వెంట్రుకలకు వారానికి రెండు, మూడు సార్లు పెడితే సరిపోతుందని సూచిస్తున్నారు. ఒకవేళ మరీ నూనెతో కూడిన జుట్టు అయితే కాస్త ఎక్కువ సార్లు పెట్టాలని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
'రోజూ టిఫిన్ చేస్తే బరువు తగ్గుతారు'- బ్రేక్ఫాస్ట్ చేసేవారు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
నిర్మలమ్మ నోట 'మఖానా' మాట- ఇది తింటే షుగర్, బీపీ సమస్యలకు చెక్! ఎంత ఆరోగ్యమో తెలుసా?