Delhi Elections 2025 Campaign Ends : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. ఇక్కడి 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 220 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. 19 వేల హోంగార్డులు, 35 వేల 626 మంది దిల్లీ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు.
దిల్లీలో కోటి 56 లక్షల మంది ఓటర్ల కోసం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలిసారి క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్-QMSను భారత్‌లో ఎన్నికల సంఘం ప్రవేశపెడుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ ఎలా ఉందో 'దిల్లీ ఎన్నికలు-2025 QMS' యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పటికే దాదాపు 7 వేల మంది సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకున్నారు.
2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాలకు గాను 67 చోట్ల జయభేరి మోగించింది. బీజేపీ కేవలం మూడు చోట్ల మాత్రమే నెగ్గింది. 2020 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 62 చోట్ల ఆమ్‌ఆద్మీ పార్టీ నెగ్గింది. బీజేపీకి 8 స్థానాలు దక్కాయి. ఈ రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. ఈసారి ఎవరు దిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటారో ఫిబ్రవరి 8న జరిగే ఓట్ల లెక్కింపు తర్వాత తేలనుంది.
దిల్లీ ఎన్నికల గురించి 8 కీలక అంశాలు
- దిల్లీలో ఈసారి హోరాహోరీ పోరు నెలకొంది. దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించారు. కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రల్లో ఉచితాలకు ఓట్లు రాలడం వల్ల దిల్లీలోనూ పోటాపోటీగా ఈ పార్టీలు ఉచితాలను ప్రకటించాయి.
- కాంగ్రెస్ కూడా తమేమీ తక్కువ కాదన్నట్లు ఉచిత హామీలు ఇచ్చింది. కులగణన చేపడతామని ప్రకటించింది. పోలింగ్ తేదీ సమీపించిన వేళ ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ఆదాయ పన్ను మినహాయింపును 12 లక్షల రూపాయలకు పెంచడం ద్వారా బీజేపీ మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేసింది.
- ఎన్నికలకు ముందుగానే పార్టీలు సంక్షేమ పథకాల అర్హులను గుర్తించే దరఖాస్తుల ప్రక్రియను చేపట్టాయి.
- అవినీతి వ్యతిరేక పునాదులపై పుట్టిన ఆప్- అవినీతి ఆరోపణల ఊబిలో కూరుకుపోయింది. దీంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మసకబారింది! అయితే దిల్లీలో పదేళ్లుగా విద్య, వైద్యంలో చేపట్టిన చర్యలతోపాటు ఉచిత విద్యుత్, తాగునీరు గత రెండు ఎన్నికల్లో అద్భుత ఫలితాలనిచ్చాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమూ ఆ పార్టీకి కలిసివచ్చింది. ఈసారీ అదే మంత్రాన్ని నమ్ముకుంది ఆప్.
- దిల్లీలో చాలా మంది ఓటర్లు కలుషిత నీరు, దారుణమైన రోడ్ల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా యమునా నదిలో కాలుష్యం ఈసారి ఎన్నికల ప్రచారంలో హాట్‌టాఫిక్‌గా మారింది. దీనిపైనే అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీశాయి. తీవ్ర ఆరోపణలు చేశాయి.
- 2013 వరకు 15ఏళ్లపాటు దిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ గత రెండు ఎన్నికల్లో ఒక్కస్థానం కూడా గెలవలేకపోయింది. ఆప్, బీజేపీ మధ్య పోరులో కాంగ్రెస్ ఊసులో లేకుండా పోయింది. ఈసారి మాత్రం ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా యత్నించింది.
- 1998 నుంచి దిల్లీలో అధికారంలో లేకపోవడం వల్ల ఈసారి ఎలాగైనా పట్టు సాధించడానికి బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది. తనకు బలమున్న నియోజకవర్గాలపైనే కాకుండా ఆప్ బలంగా ఉన్న వాటిపైనా దృష్టి సారించింది. సంఘ్ పరివార్‌తోపాటు అనుబంధ సంఘాలతో ఈ ప్రాంతాల్లో ప్రచారం చేసింది.
- ఏఐ సాంకేతికతతో సృష్టించిన స్పూఫ్‌లు, పదునైన రాజకీయ విమర్శలతో ఈసారి దిల్లీ ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగింది. అన్ని పార్టీలకు చెందిన ముఖ్యనేతలు హస్తినలో విస్తృత ప్రచారం నిర్వహించారు. బీజేపీని- భారతీయ అబద్దాల పార్టీ, దూషించే పార్టీ అని ఆమ్ ఆద్మీ పార్టీ అభివర్ణించింది. ఆప్‌ను ఓ విపత్తుగా, కేజ్రీవాల్‌ను ప్రకటనల మంత్రిగా ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ఇక కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్‌ను నకిలీ అంటూ, మోదీ చోటా రీఛార్జ్ అంటూ విమర్శించింది. AIతో సృష్టించిన మీమ్స్, డిజిటల్ ప్రచారాలు దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్య భూమిక పోషించాయి.