Travis Head Australian Cricket Awards : ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డ్స్ 2025 ప్రకటించారు. ఈసారి ట్రావిస్ హెడ్ (30) ప్రతిష్టాత్మకమైన అలన్ బోర్డర్ మెడల్‌ను గెలుచుకున్నాడు. అలానే మెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకున్నాడు.
హెడ్ గత సంవత్సరంలో ఆస్ట్రేలియా తరఫున అద్భుతంగా రాణించాడు. టెస్టులు, వన్డేలు, టీ20Iలలో కలిపి 1,427 పరుగులు చేశాడు. టెస్టులు, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆసీస్ ప్లేయర్‌గా నిలిచాడు. వన్డేల్లో రెండో స్థానం కైవసం చేసుకున్నాడు. బ్యాటింగ్‌లో దూకుడు, కీలక సమయాల్లో పరుగులు చేయగల సత్తాతో హెడ్ ప్రత్యేక గుర్తింపు పొందాడు. అతడి కెరీర్‌ను 2021 యాషెస్ సిరీస్‌లో బ్రిస్బేన్‌లో చేసిన సెంచరీ మలుపు తిప్పింది. అప్పటి నుంచి హెడ్ అటాకింగ్‌ని అలవాటుగా మార్చుకున్నాడు. 2023 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
అలన్ బోర్డర్ మెడల్
అలన్ బోర్డర్ మెడల్‌ను ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియా అత్యుత్తమ మేల్ క్రికెటర్‌కి ప్రదానం చేస్తారు. ఆటగాళ్లు, మీడియా, అంపైర్‌ల నుంచి స్వీకరించిన ఓట్ల ఆధారంగా విజేతను ఎంపిక చేస్తారు. హెడ్ 208 ఓట్లతో గెలిచాడు. తర్వాతి స్థానాల్లో జోష్ హేజిల్‌వుడ్ (158 ఓట్లు), పాట్ కమిన్స్ (147 ఓట్లు) ఉన్నారు. శ్రీలంక టెస్ట్ పర్యటనలో ఉన్న హెడ్ ప్రత్యక్షంగా అవార్డును అందుకోలేకపోయాడు. వర్చువల్‌గా అవార్డును స్వీకరించాడు. తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.
ఇతర అవార్డు విజేతలు
మరోవైపు బెలిండా క్లార్క్ అవార్డు (ఉత్తమ మహిళా క్రికెటర్)ను అన్నాబెల్ సదర్లాండ్ గెలుచుకుంది. మెన్స్ T20I ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఆడమ్ జంపా నిలిచాడు. మహిళల T20I ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును జార్జియా వేర్‌హామ్ అందుకుంది. డొమెస్టిక్ దేశీయ ప్లేయర్స్ ఆఫ్ ది ఇయర్‌గా బ్యూ వెబ్‌స్టర్ (మెన్స్, జార్జియా వోల్ (ఉమెన్స్) నిలిచారు. బ్రాడ్‌మాన్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సామ్ కొన్‌స్టాస్‌ను వరించింది.