How to Make Coconut Milk Rasam at Home: తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరిగిపోయింది. చాలా చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడి అన్నంలోకి కారంకారంగా, ఘాటుఘాటుగా ఏదైనా రసం పోసుకుని తినాలని చాలా మంది భావిస్తుంటారు. అలాంటి వారు ఓసారి ఇలా కొబ్బరిపాల రసం చేసుకోండి. చాలా టేస్టీగా ఉండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పైగా ఈ రెసిపీని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. అంతేకాదు చలికాలంలో జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం వంటి సమస్యలతో ఇబ్బందిపడేవారికి సూపర్ రెమిడీ. మరి, లేట్ చేయకుండా ఈ రసం చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- కొబ్బరి ముక్కలు - 2 కప్పులు
- నీళ్లు - 2 కప్పులు
- శనగపిండి - 1 టీ స్పూన్
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - అర టీ స్పూన్
- జీలకర్ర - అర టీ స్పూన్
- పచ్చిమిర్చి - 2
- ఉల్లిపాయ - 1
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఎండు మిర్చి - 2
- ఇంగువ - పావు టీ స్పూన్
- టమాట - 1
- ఉప్పు - రుచికి సరిపడా
- మిరియాల పొడి - అర టీ స్పూన్
- జీలకర్ర పొడి - అర టీ స్పూన్
- పసుపు - పావు టీ స్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- నిమ్మకాయ - 1
తయారీ విధానం:
- మిక్సీజార్లోకి సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు నీళ్లు పోసి మరోసారి గ్రైండ్ చేసి జల్లెడ లేదా ఓ క్లాత్లో కొబ్బరి మిశ్రమం పోసి పాలను వడకట్టాలి.
- పాలను వడకట్టిన తర్వాత మిగిలిన కొబ్బరి మిశ్రమాన్ని మళ్లీ మిక్సీజార్లో వేసి మరో కప్పు నీళ్లు పోసి ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వడకట్టి పాలను సెపరేట్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి శనగపిండి వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన శనగపిండిని కొబ్బరిపాలలో కలిపి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా శనగ పిండి కలుపుకోవడం వల్ల పాలు అనేవి విరగవు.
- స్టవ్ ఆన్ చేసి మరో గిన్నె పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.
- ఆ తర్వత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఉల్లిపాయలను మగ్గించుకోవాలి.
- అనంతరం ఇంగువ వేసి కలిపి టమాట ముక్కలు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
- రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసి కలిపి రెడీ చేసుకున్న కొబ్బరిపాలను పోసుకోవాలి.
- కొబ్బరిపాలను పోసిన తర్వాత బాగా కలిపి సిమ్లో రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి.
- చివరగా కొత్తిమీర తరుగు, నిమ్మరసం పిండి కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరిపాల రసం రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
షుగర్, బరువును అదుపులో ఉంచే "క్యారెట్ కొబ్బరి జొన్న రొట్టెలు" - సింపుల్గా చేసుకోండిలా!
వింటర్ స్పెషల్ : ఘుమఘుమలాడే "క్యారెట్ కొబ్బరి సూప్" - వేడివేడిగా గొంతులోకి జారుతుంటే అదుర్స్!