Weight loss medication decreasing alcohol intake : మద్యపానం ఒక పరిమితి దాటితే ఆరోగ్య పరంగా ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. కొందరు వైద్యులు అసలు మద్యం తాగే విషయంలో పరిమితి అనేదే లేదని కూడా చెబుతుంటారు. ఎంత తీసుకుంటే అంతమేర ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తూనే ఉంటారు. అయినప్పటికీ, మద్యపానం వ్యసనంగా మారిన వారు ఓ పట్టాన మానలేరు. అయితే, బరువు తగ్గడానికి, షుగర్ లెవల్స్ తగ్గడానికి వాడే మందుల ద్వారా మందు బాబులు తమకు తెలియకుండానే, తాగే క్వాంటిటీని తగ్గించుకుంటున్నట్టు ఓ పరిశోధన వెల్లడించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
"హెన్రీ ఫోర్డ్ హెల్త్" అనే ఆరోగ్య సంస్థ తరపున ఈ పరిశోధన నిర్వహించారు. ఇక్కడ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ రీసెర్చ్‌గా పనిచేస్తున్న "లిసా మిల్లర్-మాటెరో" ఆధ్వర్యంలో ఈ రీసెర్చ్ కొనసాగింది. JAMA నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, అధిక బరువును తగ్గించుకునేందుకు మందులు వాడుతున్న వారు క్రమంగా మద్యపానాన్ని తగ్గిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
ఎంతో కాలంగా అతిగా మద్యం తాగుతున్న ఊబకాయులు, తమ బరువు తగ్గించుకోవడానికి మందులు వాడడం మొదలు పెట్టిన దగ్గర్నుంచి తక్కువగా మద్యం తాగుతూ వచ్చారని అధ్యయనం గుర్తించింది. తాము తాగే మద్యంలో దాదాపు 19 రెట్ల కన్నా ఎక్కువగా మద్యాన్ని తగ్గించినట్టు పరిశోధకులు తేల్చారు. అంతేకాదు, వారు తమ బరువును ఎంతగా తగ్గించుకుంటే, మద్యం వినియోగం కూడా అంత మేర తగ్గించినట్టు గుర్తించారు. కాస్త మద్యం తాగగానే కడుపు నిండినట్టుగా ఫీలవడం, ఇంకా తలతిరిగినట్టు కూడా అనిపించేలా చేయడం ఈ మందుల ప్రత్యేకతగా పరిశోధకులు చెబుతున్నారు.
ఊబకాయం కోసం తీసుకునే మందులతోపాటు టైప్-2 డయాబెటిస్ కోసం తీసుకునే మందులు కూడా ఆల్కహాల్ తాగడాన్ని తగ్గిస్తున్నట్టు మరొక అధ్యయనం పేర్కొంది. ఈ మెడిసిన్ తీసుకుంటున్న వారిలో మద్యం తాగాలనే కోరిక చాలా వరకు తగ్గిందని కనుగొన్నారు. ఆల్కహాల్ తాగినప్పుడు కూడా దాని ప్రభావాలకు తక్కువగా గురయ్యారని సదరు రీసెర్చ్ పేర్కొంది.
మొత్తంమీద బరువు, షుగర్ తగ్గించుకోవడానికి ఉపయోగించే మందులు ఆల్కహాల్ వినియోగాన్ని కూడా తగ్గించడం సానుకూలమైన విషయంగా పరిశోధకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది కొత్త అంశాలను లేవనెత్తుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ విషయం నిర్ధారణకు మరిన్ని రీసెర్చ్‌లు అవసరమని అంటున్నారు.
ఇవి కూడా చదవండి :
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - ఆ బీర్లు మళ్లీ వచ్చేస్తున్నాయ్
రోజుకో పెగ్గు ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదేనా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?