Best recipe for Sugar Patients in Winter : షుగర్ పేషెంట్లు చలికాలంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇన్సులిన్ ప్రభావం తగ్గడంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. నీరు తక్కువగా తాగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి, రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకునేందుకు మంచి డైట్ తీసుకోవడం ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు. అందుకే, ఈ వింటర్లో మీకోసం చక్కటి రెసిపీ తీసుకొచ్చాం. ఈ డైట్‌ను డయాబెటిస్ యూకే ప్రచురించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- ఉల్లిగడ్డ (పెద్దది) - 1
- టమాటాలు - 800 గ్రాములు
- బెల్ పెప్పర్ - మూడు రంగుల్లో ఉన్నవి ఒక్కొక్కటి
- బీన్స్ గింజలు - 400 గ్రాములు
- పాలకూర - 150 గ్రాములు
- టమాటా ప్యూరీ - 2 స్పూన్లు
- వెల్లుల్లి - 2 రెబ్బలు
- ఆయిల్
- గరం మసాలా
తయారీ విధానం :
- ఉల్లిపడ్డను సన్నగా స్లైస్ మాదిరిగా కట్ చేసుకోవాలి.
- టమాటాలను కూడా కట్ చేసుకోవాలి.
- ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉండే మూడు రకాల బెల్ పెప్పర్స్ తీసుకోండి. కట్ చేసి వాటి మధ్యలో ఉన్న గింజలు తీసేయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
- బీన్స్ గింజలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి.
- పాల కూరను కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి.
- వెల్లుల్లి రెబ్బలను చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి.
- టమాటా ప్యూరీ, గరం మసాలా సిద్ధంగా ఉంచుకోండి.
ఇప్పుడు స్టౌమీద పాన్ పెట్టి ఆయిల్ వేయండి. తక్కువ కేలరీలు ఉండే ఆయిల్ అయితే మంచిది. సాధ్యమైనంత తక్కువగా వాడాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేయండి. స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచండి. ఇందులో 4 టేబుల్ స్పూన్ల వాటర్ వేయండి. ఈ నీరు ఆవిరైపోయి, ఉల్లిపాయ మెత్తబడే వరకు అంటే 3-4 నిమిషాలు ఉడికించండి.
ఆ తర్వాత వెల్లుల్లి వేసి మరో 1-2 నిమిషాలు ఉడికించండి.
ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కోసిన టమాటాలు, కట్ చేసుకున్న బెల్ పెప్పర్స్, ఇంకా టమాటా ప్యూరీ కూడా అందులో వేసేయండి. మూత పెట్టి, దాదాపు 15 నిమిషాల పాటు లో-ఫ్లేమ్‌లో ఉడికించాలి.
ఆ తర్వాత మూత తీసి బీన్స్, పాలకూర యాడ్ చేయండి. బాగా కలిపండి. పాలకూరను లిక్విడ్ కిందకు నెట్టండి. అలా మూత లేకుండానే 6–8 నిమిషాల వరకు ఉడికించండి. ఈ గ్యాప్‌లో పాలకూర సరైన మోతాదులో ఉడికిపోతుంది.
ఈ వంటకాన్ని నేరుగా తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. షుగర్ లెవల్స్ తగిన మోతాదులో ఉంటాయి.
అలా తినలేము అనుకునేవారు జొన్న రొట్టెతో తింటే చాలా బాగుంటుంది.