How to Reduce Stretch Marks in Children: సాధారణంగా స్ట్రెచ్‌మార్క్స్ అనేవి డెలివరీ అయిన మహిళలకే వస్తాయని భావిస్తారు చాలా మంది. కానీ, అది పొరపాటు అంటున్నారు నిపుణులు. కేవలం డెలివరీ అయిన వారిలో మాత్రమే కాకుండా, బరువులో హెచ్చుతగ్గులు, పని ఒత్తిడి వల్ల కూడా చర్మం సాగి స్ట్రెచ్‌మార్క్స్ వస్తుంటాయని చెబుతున్నారు. అంతేకాదు, ఈ స్ట్రెచ్ మార్క్స్ కేవలం పెద్దలకే కాకుండా పిల్లల్లో కూడా వస్తాయంటున్నారు. మరి, అందుకు కారణాలు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ స్టోరీలో చూద్దాం.
గర్భిణులకు, డెలివరీ అయిన వాళ్లకు మాత్రమేకాకుండా, ఎదిగే పిల్లల్లోనూ స్ట్రెచ్‌మార్క్స్ కనిపిస్తాయని సౌందర్య నిపుణులు డాక్టర్ శైలజ సూరపనేని చెబుతున్నారు. అంతేకాకుండా హఠాత్తుగా బరువు పెరిగినా, తగ్గినా, పొడవు పెరుగుతున్నా, డైట్ చేస్తున్నా ఇవి వచ్చే ఆస్కారముందని చెబుతున్నారు. ముఖ్యంగా హార్మోన్లలో మార్పులు, వంశపారంపర్యం కూడా కారణమే అంటున్నారు. 13 నుంచి 16 ఏళ్ల వయసు పిల్లల్లో ఇది చాలా సహజమని, ముదురు ఎరుపు రంగులో మొదలై తెలుపు గీతల్లా మిగులుతాయని చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు: నిజానికి చాలామందిలో స్ట్రెచ్‌మార్క్స్ వాటంతటవే తగ్గిపోతాయని, లేని పక్షంలో ఆలివ్ ఆయిల్, కోకోబటర్, విటమిన్- ఇ, హైలురోనిక్ యాసిడ్ ఉన్న క్రీములు రాస్తే చర్మానికి తేమ అంది సమస్య కాస్త తగ్గుతుందంటున్నారు. అలాగే రాత్రుళ్లు రెటినాయిక్ యాసిడ్ క్రీములు, సిలికాన్ జెల్ రాసి మసాజ్ చేసినా మంచి ఫలితం లభిస్తుందని సూచిస్తున్నారు. అయితే, కేవలం క్రీములకే పరిమితం కాకుండా జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటూ ఎ, సి విటమిన్లు, మినరల్స్, జింక్, సెలీనియం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇవి ట్రై చేసినా:
ఆలివ్ నూనె, నిమ్మరసం: ఓ కప్పు చక్కెరలో పావు కప్పు ఆలివ్‌నూనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపాలి. ఈ మిశ్రమాన్ని స్ట్రెచ్‌మార్క్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత రుద్ది కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
కలబంద గుజ్జు, కొబ్బరి నూనె : స్ట్రెచ్‌మార్క్స్ తొలగించుకోవడానికి కలబంద ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అందుకోసం కొద్దిగా కలబంద గుజ్జు, కొబ్బరినూనె కలిపి రోజూ పొట్టపై అప్లై చేసుకుని వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు ప్రయత్నించాలని, అయినా సమస్య తగ్గకపోతే వైద్యులను సంప్రదించమని సౌందర్య నిపుణురాలు డాక్టర్ శైలజ సూరపనేని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
సూపర్ ఐడియా: పొట్టపై స్ట్రెచ్‌మార్క్స్ కనిపించకుండా చేయడం ఇంత ఈజీనా! మీరు ట్రై చేస్తారా?
పిల్లలకు 'మేకప్' వేస్తున్నారా? - అయితే, ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!