Gender Discrimination Decreasing in Telangana : ఒకప్పుడు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి వచ్చింది అనేవారు. నట్టింట్లో లక్ష్మీదేవీ తిరుగుతుందనేవారు. తదనంతర కాలంలో అమ్మాయి పుడితే ఆడపిల్ల పుట్టిందా అనే నిట్టూర్పు. భ్రూణ హత్యలు, లింగ వివక్ష, పుట్టాక అడుగడుగునా ఆంక్షలు విధించే వారు. కానీ కాలక్రమంలో తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పులు వస్తున్నాయి. బాలిక పుట్టినా ఆనందిస్తున్నారు. ఉన్నత చదువులకు ప్రోత్సహిస్తున్నారు.
అయితే చదువొక్కటే సరిపోదు. వారిని స్వేచ్ఛా విహంగాల్లా ఎదగనిచ్చే సమాజం ఏర్పడాలి. గతంతో పోలిస్తే ప్రస్తుతం తల్లిదండ్రులు ఆడ పిల్లలను దూరంగా పంపించి మంచి చదువులు చదివిస్తున్నారు. బాలికల కోసం ప్రత్యేకంగా వసతి గృహాలు, ప్రత్యేక పాఠశాలలు అందుబాటులోకి రావడంతో చొరవ చూపుతున్నారు. ఫలితంగా పదో తరగతి, ఇంటర్ వార్షిక ఫలితాల్లో బాలురతో పోలిస్తే బాలికలే పైచేయి కనబరుస్తున్నారు. గతేడాది ఇంటర్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే అధికంగా ఉత్తీర్ణులయ్యారు.
నేషనల్ గర్ల్ చైల్డ్ డే- అమ్మాయిలకు తల్లిదండ్రులు ఇచ్చే గిఫ్ట్ ఇదే!
ఇంకా చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది : బాలికలు అన్ని రంగాల్లో పైచేయి సాధిస్తున్నా, ఇంకా చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. కొందరు తల్లిదండ్రులు బాలురను బడికి పంపించి, బాలికలను పనికి పంపిస్తున్న పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఇంకా ఉన్నాయి. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ దాడుల్లో పనిలో మగ్గుతున్న వారిలో 5 శాతం బాలికలే అధికంగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఇంకా బాల్య వివాహాలు ఆగడం లేదు.
- ఆడ పిల్లలకు అండగా ఉండటంతో పాటు బాలిక విద్య ప్రాముఖ్యత, వారి ఆరోగ్యం పోషణపై అవగాహన కల్పించడం, లింగ సమానత్వం కోసం 2008 జనవరి 24 నుంచి జాతీయ బాలిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
- నేషనల్ క్రైమ్ గణాంకాల ప్రకారం పోక్సో చట్టం కింద నమోదవుతున్న నేరాల్లో 99 శాతానికి పైగా బాలికలే బాధితులు ఉంటున్నారు.
- దేశంలో ప్రతి 1000 మంది బాలురకు 964 మంది బాలికలు మాత్రమే ఉంటున్నారు.
"గతంతో పోలిస్తే తల్లిదండ్రుల్లో చాలా మార్పు వచ్చింది. ఆడ, మగ ఎవరైనా ఒకటే అనే భావన ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. భావి తరాలను దృష్టిలో ఉంచుకొని బాలికల హక్కులను గుర్తిస్తూ 18 ఏళ్ల వరకు విద్య, వైద్యం, ఆరోగ్యం అందించాల్సిన బాధ్యత ఉంది." - సునంద, మాతా, శిశు సంక్షేమ అధికారి, గద్వాల