Maha Shivaratri Fasting Types : మహా శివరాత్రి నాడు ఆ శివయ్య భక్తులు ఉపవాసం పాటించడం ఆనవాయితీ. ఉపవాసంతోపాటు జాగారం చేయడం ద్వారా పరమేశ్వరుడి కృపకు పాత్రులం అవుతామని భావిస్తారు. ఇలా ఉపవాసం ఉండడం ద్వారా భగవంతుడిని సేవలో తరించడం మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా పదిలం చేసుకున్నవారు అవుతారని పండితులు చెబుతున్నారు. ఫాస్టింగ్ ద్వారా కలిగే ప్రయోజనాన్ని వైద్య శాస్త్రం కూడా గుర్తు చేస్తూనే ఉంటుంది.
మరి, మీరు ఇవాళ ఉపవాసం ఉంటున్నారా? అయితే, ఉపవాసాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో మీకు తెలుసా? ఇంతకూ మీరు పాటిస్తున్న ఉపవాసం ఏ పరిధిలోకి వస్తుందో తెలుసా? ఇలాంటి ప్రశ్నలకు హైదరాబాద్ చెందిన దేవినేని సురేష్ వివరిస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
నిర్జల ఉపవాసం : రోజు మొత్తం (24 గంటల పాటు) ఆహారం మాత్రమే కాకుండా నీళ్లు కూడా తీసుకోకుండా చేస్తారు. ఇది అత్యంత కఠిన ఉపవాసం. దీన్ని ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే చేయాలి.
జల ఉపవాసం : ఇది కూడా కఠిన ఉపవాసమే. ఎలాంటి ఆహారం లేకుండా కేవలం నీళ్లు మాత్రమే తీసుకోవాలి.
ద్రవ ఉపవాసం : లిక్విడ్ కంటెంట్ తీసుకుంటారు. అంటే కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, టీ, కాఫీ వంటివి తీసుకుంటారు.
ఫలోపవాసం : పండ్లు తీసుకుంటూ చేసే ఉపవాసమిది. పండ్లు, పాలు, మజ్జిగ, పెరుగు, గింజలు మొదలైనవి తీసుకోవచ్చు.
సాత్విక ఉపవాసం : కొంత ఆహారం తీసుకుంటూ చేసే ఉపవాసం ఇది. ఆరోగ్యం సహకరించని వారు చేస్తారు. మఖానా, సగ్గుబియ్యం, ఉడకబెట్టిన బంగాళదుంపలు, డ్రైఫ్రూట్స్ వంటి తేలికపాటి సాత్వికాహారం ఉప్పు లేకుండా తీసుకుంటారు.
వీళ్లు ఉపవాసం ఇలా చేయాలి :
బీపీ, ఇతరత్రా సమస్యలు ఉన్నవారు పూర్తి ఉపవాసం చేయకూడదని సూచిస్తున్నారు. బీపీ ఉన్నవారు పాలు, పండ్లతో కూడిన ఉపవాసాన్ని పాటిస్తే మంచిది. ఆరోగ్య ఇబ్బందులు ఉంటే, గోరువెచ్చని నీళ్లు, హెర్బల్ టీ కావాల్సినంత తాగాలని సూచిస్తున్నారు. ఒంట్లో తగినం శక్తిని నిల్వ చేసుకోవడానికి కొబ్బరి నీళ్లు మంచివి. వీరు టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. నీరసంగా అనిపిస్తే తేనె కలిపిన వాటర్, కొబ్బరి నీళ్లు, వాల్‌నట్స్, బాదంపప్పు నానబెట్టిన నీళ్లు తీసుకోవడం మంచిదట. మంత్రోచ్చారణ, ధ్యానం, ఆధ్యాత్మిక పఠనంలో మునిగిపోతే బాగుంటుంది.
షుగర్ పేషెంట్లకు మేలు :
పైన చెప్పిన ఉపవాసాల్లో అనువైన పద్ధతిని మాత్రమే ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
ఉపవాసం వల్ల శరీరంలో నిల్వ ఉన్న వ్యర్థాలు నశిస్తాయి. జీర్ణం కాకుండా మిగిలిపోయిన ఆహారాన్ని తొలగించడంలోనూ ఉపవాసం సహాయపడుతుందని చెబుతున్నారు.
నిత్యం ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ నిర్విరామంగా పని చేస్తూనే ఉంటుంది. కొంత సమయం ఆహారం ఇవ్వకపోవడం వల్ల జీర్ణ అవయవాలు విశ్రాంతి తీసుకుంటాయి. దీనివల్ల ఉత్తేజితమవుతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది.
కడుపు ఖాళీ ఉండటం వల్ల మానసికంగా కూడా మేలు జరుగుతుంది. మెదడు పనితీరు మెరుగవుతుంది.
ముఖ్యంగా ఇన్సులిన్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ క్రమబద్ధం అవుతాయి. బీపీతో బాధపడుతున్నవారికి కూడా ఉపవాసం ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.
ఉపవాస విరమణ ఇలా :
ఉపవాసం ముగించే వారు మొదట పండ్లు తినాలి. లేదంటే నానబెట్టిన గింజలు తీసుకోవాలి. గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కలిపి తీసుకోవడం కూడా మంచిదే.
భోజనంలో ఆవిరి మీద ఉడికించిన కూరగాయలు తినాలి. కిచిడీ, పప్పు, పెరుగుతో తయారు చేసిన వంటకాలు తీసుకుంటే మంచిది. మొత్తంగా ఈజీగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.
ఒకేసారి కడుపు నిండా తినకూడదు. దీనివల్ల జీర్ణవ్యవస్థలో ఇబ్బంది కలుగుతుంది.
ఇవి కూడా చదవండి :
శివరాత్రి భక్తులకు చక్కటి ఉపవాస ఆహారం చిలగడదుంప - చుక్క నూనె, నీళ్లు లేకుండా ఇలా ఉడికించండి!
మహా శివరాత్రి రోజు "ఉపవాసం" ఉంటున్నారా? - ఈ నియమాలు పాటిస్తేనే పూర్తి ఫలితం!