Pudina Roti Pachadi in Telugu : మనం పుదీనాను ఏదైనా కూరల్లో సువాసన కోసమో, చివర్లో లుక్ కోసమే ఎక్కువగా వేస్తుంటాం. నిజానికి పుదీనా కూరలకు అదనపు టేస్ట్‌ని తీసుకొస్తుంది. అలాగే, కొందరు పుదీనాతో చట్నీని చేసుకుంటుంటారు. అయితే, ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓసారి ఈ స్టైల్లో "పుదీనా పచ్చడి" చేసుకోండి. భోజనంలోకి మరేమీ లేకుండా ఈ చట్నీతోనే అన్నం మొత్తం తినేస్తారు. అంత రుచికరంగా ఉంటుంది ఇది! ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. పైగా దీన్ని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి, ఈ టేస్టీ అండ్ హెల్దీ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- పుదీనా కట్టలు - 2(పెద్దవి)
- ఉల్లిపాయలు - 2(చిన్న సైజ్‌వి)
- పచ్చిమిర్చి - రుచికి తగినన్ని
- జీలకర్ర - 1 చెంచా
- ధనియాలు - 2 చెంచాలు
- కరివేపాకు - పిడికెడు
- చింతపండు - చిన్న నిమ్మకాయ సైజంత
- ఉప్పు - రుచికి సరిపడా
- తెల్ల నువ్వులు - 50 గ్రాములు
- నూనె - 3 చెంచాలు
తాలింపుకోసం :
- నూనె - తగినంత
- ఆవాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఎండుమిర్చి - 2
- ఇంగువ - చిటికెడు
- కరివేపాకు - కొద్దిగా
"కొత్తిమీర నిల్వ పచ్చడి" - ఇలా చేస్తే వారెవ్వా! - కనీసం 6 నెలలు నిల్వ!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలోకి పుదీనా ఆకులను గిల్లుకొని శుభ్రంగా కడిగి పక్కనుంచాలి. అలాగే, చింతపండుని ఒక చిన్న బౌల్లో నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలను కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి.
- అనంతరం స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని నువ్వులు వేసి లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ధనియాలనూ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే కడాయిలో 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చిని ముక్కలుగా తుంపి వేసి చక్కగా వేయించుకోవాలి. అవి వేగాక అందులో కరివేపాకు, జీలకర్ర కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచాలి.
- ఆ తర్వాత అందులోనే మరో చెంచా నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కడిగి పక్కన పెట్టుకున్న పుదీనా ఆకులను వేసుకొని అందులోని నీరంతా ఇగిరిపోయి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆవిధంగా వేయించుకున్నాక పుదీనానూ ఒక బౌల్లోకి తీసుకోవాలి.
చూస్తేనే నోరూరిపోయే తెలంగాణ స్టైల్ "చుక్కకూర పచ్చడి" - గోంగూర చట్నీని మించిన టేస్ట్!
- ఇప్పుడు శుభ్రంగా కడిగి తుడిచిన రోట్లో ముందుగా వేయించుకున్న నువ్వులు, ధనియాలు వేసి మెత్తని పొడిలా దంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న పచ్చిమిర్చి, పుదీనా, ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు వేసుకొని రుబ్బుకోవాలి.
- అలా రుబ్బుకునేటప్పుడు ఒకవేళ పచ్చడి గట్టిగా అనిపిస్తే మధ్యమధ్యలో కొద్దిగా గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకుంటూ మీకు పచ్చడి ఎంత లూజ్ కావాలో దానికి అనుగుణంగా చక్కగా రుబ్బుకోవాలి.
- పచ్చడి కాస్త మెదిగాక ముందుగా దంచుకున్న నువ్వుల పొడిని వేసుకొని మరోసారి చట్నీని మంచిగా నూరుకోవాలి.
- పచ్చడిని మెత్తగా రుబ్బుకున్నాక ఆఖర్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాసేపు రుబ్బుకొని ఒకబౌల్లోకి తీసుకోవాలి. అయితే, ఆనియన్స్ మరీ మెత్తగా నలగకుండా పంటికి తగిలేవిధంగా ఉండేలా చూసుకోవాలి.
- ఒకవేళ మీకు రోలు అందుబాటులో లేకపోతే మిక్సీలో ఇదే ప్రాసెస్‌లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి. కానీ, రోట్లో రుబ్బుకున్న టేస్ట్ రాదని గుర్తుంచుకోవాలి.
- ఇప్పుడు పచ్చడి కోసం పోపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగాక ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు, ఇంగువ వేసుకొని చక్కగా వేయించుకోవాలి.
- తాలింపు మంచిగా వేగిందనుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని దాన్ని ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "పుదీనా పచ్చడి" రెడీ!
అమ్మమ్మల కాలం నాటి "చింతకాయ కొబ్బరి పచ్చడి" - నోట్లో నీళ్లు ఊరిపోవడం గ్యారెంటీ!