Personal Loan for 25000 Salary : అనుకోకుండా కొన్ని ఆర్థిక అవసరాలు వస్తుంటాయి. వివాహాది శుభకార్యాలు, టూర్‌లు, ఇంటి పునర్నిర్మాణం, ఇంటి మరమ్మతులు ఇలా ఏ అవసరం వచ్చినా వేతన జీవులకు అప్పటికప్పుడు డబ్బులు సర్దుబాటు కావు. అలాంటప్పుడు వ్యక్తిగత రుణాల కోసం ప్రయత్నాలు మొదలు పెడుతుంటారు. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల(ఎన్‌బీఎఫ్‌సీ)కు దరఖాస్తు చేస్తుంటారు. అవి మంజూరు చేసే రుణాలను తీసుకొని, ప్రతినెలా ఈఎంఐల రూపంలో వాటిని తీరుస్తుంటారు. అయితే రుణాల మంజూరు ప్రక్రియ మనం అనుకున్నంత సులభంగా జరిగిపోదు. రూ.25వేల వేతనం కలిగినవారు వ్యక్తిగత రుణాలను పొందడం ఎలాగో ఈ కథనంలో తెలుసుకుందాం.
క్రెడిట్ స్కోర్ ఆధారంగా
21 నుంచి 60 ఏళ్లలోపు వారు వ్యక్తిగత రుణం పొందడానికి అర్హులు. ఉద్యోగం చేసేవారికి క్రెడిట్ స్కోరు ఆధారంగా రుణాన్ని మంజూరు చేస్తారు. సాధ్యమైనంత ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్నవారికే రుణాలు సులభంగా మంజూరవుతాయి. రుణం కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి దాన్ని సకాలంలో తిరిగి చెల్లించగలడా? లేడా? అనే అంశాన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ప్రధానంగా పరిశీలిస్తాయి. సిబిల్ స్కోరు బాగుంటే, అతడి వేతన స్థాయిని బట్టి రుణాన్ని మంజూరు చేస్తాయి.
రూ.25వేల వేతనంతో రుణం పొందొచ్చా ?
వ్యక్తిగత రుణాన్ని మంజూరు చేసే క్రమంలో కొన్ని బ్యాంకులు నిర్దిష్ట వేతన పరిమితిని విధిస్తాయి. ఇది బ్యాంకులను బట్టి మారిపోతుంటుంది. కొన్ని బ్యాంకులు ప్రతినెలా రూ.25వేల నుంచి రూ.30వేల దాకా వేతనం పొందే వారికి రుణాలను మంజూరు చేస్తుంటాయి. ఇంకొన్ని బ్యాంకులు ఇంతకంటే ఎక్కువ వేతనం ఉన్నవారికే రుణాలిస్తాయి. వేతనంతో పాటు సిబిల్ స్కోరును కూడా తప్పకుండా పరిశీలిస్తాయి. కనీసం 700 కంటే ఎక్కువ స్కోరు ఉంటే రుణం మంజూరయ్యే అవకాశాలు పెరుగుతాయి.
ఉద్యోగి నెలవారీ వేతనం కంటే దాదాపు 10 రెట్ల నుంచి 24 రెట్ల మొత్తాన్ని రుణంగా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఇస్తుంటాయి. ఈ లెక్కన ప్రతినెలా సగటున రూ.25వేల వేతనం పొందే వారికి రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వ్యక్తిగత రుణం లభిస్తుంది. అయితే ఈ మొత్తం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీని బట్టి మారుతుంది. ప్రభుత్వ, ప్రైవేటురంగ ఉద్యోగులందరికీ ఈ రుణాలు మంజూరవుతాయి. రుణానికి దరఖాస్తు చేసే క్రమంలో కేవైసీ కోసం ఆధార్ కార్డుతో పాటు పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు లేదా ఓటరు గుర్తింపు కార్డులను ఇవ్వాల్సి ఉంటుంది. ఆదాయ ధ్రువీకరణ కోసం బ్యాంకు స్టేట్‌మెంట్లు, శాలరీ స్లిప్స్ సమర్పించాలి.
వడ్డీరేటు, ఈఎంఐల సంఖ్య చాలా ముఖ్యం
రుణం మంజూరయ్యే క్రమంలో వడ్డీరేటు, రుణం తిరిగి చెల్లించే వ్యవధి గురించి దరఖాస్తుదారుడు తెలుసుకోవాలి. ఎందుకంటే రుణం చెల్లింపు గడువు తీరేలోగా మనం ఎంత మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నామనేది ఈ రెండు అంశాలే నిర్ణయిస్తాయి. వడ్డీరేటు ఎక్కువగా ఉన్నా, ఈఎంఐల సంఖ్య ఎక్కువగా ఉన్నా మీపై అదనపు భారం పడటం ఖాయం. సాధ్యమైనన్ని తక్కువ ఈఎంఐలలో రుణాన్ని తిరిగి చెల్లిస్తే వడ్డీభారం బాగా తగ్గిపోతుందని మనం గుర్తుంచుకోవాలి. మన నెలవారీ ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు, అద్దెలు, అప్పటికే ఉన్న అప్పుల ఈఎంఐలు వంటివన్నీ లెక్కలోకి తీసుకొని కొత్త లోన్ ఈఎంఐ ఎంత ఉండాలనేది నిర్ణయించుకోవాలి.
పర్సనల్ లోన్ కావాలా? ఆధార్ కార్డ్ ఉంటే చాలు- అప్లై కూడా చాలా ఈజీ!
ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తెలుసుకోవడం మస్ట్!