Centre Conspiring To Kill Kejriwal : కేంద్ర ప్రభుత్వం, దిల్లీ పోలీసులపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సంచలన ఆరోపణలు చేసింది. తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, దిల్లీ పోలీసులు కుట్ర పన్నారని ఆరోపించింది. ఆ కుట్రలో భాగంగానే కేజ్రీవాల్ రక్షణ కోసం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన భద్రతా బృందాన్ని బీజేపీ సారథ్యంలోని కేంద్ర సర్కార్ ఉపసంహరించిందని తెలిపింది. శుక్రవారం దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దిల్లీ సీఎం ఆతిశీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) వెంటనే ఈ అంశంపై స్పందించాలని, కేజ్రీవాల్‌కు పంజాబ్ ప్రభుత్వం కల్పించిన భద్రతను పునరుద్ధరించి, పారదర్శకతను చాటుకోవాలన్నారు. కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు కలిగించే రీతిలో ఇప్పటి వరకు జరిగిన దాడులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
'అమిత్ షా కనుసన్నల్లో'
"దిల్లీ పోలీసులు బీజేపీకి చెందిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లో పనిచేస్తున్నారు. కేజ్రీవాల్‌పై పదేపదే దాడులు జరుగుతున్నా వారు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. అందుకే వారిపై మా పార్టీకి నమ్మకం లేదు" అని ఆతిశీ, మాన్ ఆరోపించారు. ఈ మేరకు తాము కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశామని వెల్లడించారు. "కేజ్రీవాల్‌పై వరుస దాడులు జరుగుతున్నాయి. గతేడాది అక్టోబరులో కూడా ఆప్ అధినేతపై కొందరు దాడి చేశారు. మేం దర్యాప్తు చేయగా ఆ దాడికి పాల్పడిన వారు బీజేపీ కార్యకర్తలని తేలింది. పోలీసులు వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు" అని ఆతిశీ ఆరోపించారు. "దిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ దుష్ట రాజకీయాలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగానే కేజ్రీవాల్‌కు భద్రత లేకుండా చేసింది" అని దిల్లీ, పంజాబ్ సీఎంలు అన్నారు.
#WATCH | Delhi CM Atishi says, " ...there are two players behind this conspiracy - one is workers of bjp who attack arvind kejriwal and pelt stones on him in different parts of delhi, the second player is delhi police that comes under bjp & amit shah. with the collusion of bjp and… https://t.co/XWu9fESaox pic.twitter.com/1zuYL7KWFO
— ANI (@ANI) January 24, 2025
70 స్థానాల్లో 699 మంది అభ్యర్థులు
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరగనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే రోజు పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కిస్తారు. వివిధ పార్టీలకు చెందిన 699 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ ఎన్నికల్లో తేలనుంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య నెలకొంది. దేశ రాజధాని దిల్లీలో 1,55,24,858 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 83,49,645 మంది, మహిళలు 71,73,952 మంది, థర్డ్ జెండర్ వారు 1,261 మంది ఉన్నారు. అక్టోబరు 29 నుంచి జనవరి మొదటి వారం వ్యవధిలో ఓటర్ల సంఖ్య 1.09 శాతం మేర పెరిగింది.
ఆప్ 'మిడిల్ క్లాస్ మేనిఫెస్టో' రిలీజ్- బీజేపీ టార్గెట్‌గా ఏడు డిమాండ్లు
KG టు PG ఉచిత విద్య- యువతకు రూ.15వేల సాయం- బీజేపీ మరో మ్యానిఫెస్టో రిలీజ్!