These Foods Good for Heart Health : మన శరీరంలో ముఖ్యమైన భాగం గుండె. చాలా సున్నితమైన ఈ అవయవాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ, మారుతున్న జీవశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండె సంబంధిత సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సరైన వ్యాయామం, విశ్రాంతితో పాటు, గుండెకు ఆరోగ్యాన్ని అందించే ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమంటున్నారు నిపుణులు.
ఇదిలా ఉంటే, ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో మెడిటరేనియన్ డైట్‌లోని కొన్ని మొక్కల ఆధారిత ఫుడ్స్ గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, సమస్యల ముప్పును తగ్గించడానికి సహాయపడతాయని కనుగొన్నారు. స్పెయిన్ పరిశోధకులు జరిపిన ఈ రీసెర్చ్ ఇటీవల "ఫుడ్ బయోసైన్స్" అనే జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ పరిశోధనకు "యూనివర్సిటీ ఆఫ్ బార్నిలోనా"లో పోస్ట్ డాక్టోరల్ పరిశోధకుడైన రెనే డెల్గాడో మార్గదర్శకత్వంలో పనిచేసిన జీవశాస్త్రవేత్త మాటేయూ అంగురా తేజెడోర్ నాయకత్వం వహించారు. ఇంతకీ, ఆ ఫుడ్స్ ఏంటి? పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మెడిటరేనియన్ డైట్‌లోని కొన్ని మొక్కల సంబంధిత ఆహారాలపై ఈ పరిశోధనను జరిపారు. ముఖ్యంగా వెల్లుల్లి, కుంకుమపువ్వు, ఆలివ్, రోజ్మేరీ, గ్రేప్‌వైన్(ద్రాక్ష) వంటివి అందులో ఉన్నాయి. ఈ మొక్కలలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, వాసోడైలేటరీ లక్షణాలను కలిగి ఉన్నాయని ఈ అధ్యయనంలో కనుగొన్నారు. ఇవి హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో సహాయపడతాయని గుర్తించారు.
ప్రధానంగా వెల్లుల్లి, కుంకుమపువ్వు, ఆలివ్, రోజ్మేరీ, గ్రేప్‌వైన్(ద్రాక్ష) మొక్కల నుంచి వచ్చే బయోయాక్టివ్ సమ్మేళనాలు అథెరోస్క్లెరోసిస్ చికిత్సలో, గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఈ అధ్యయనం ఫలితాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, మానవులలో ఈ సమ్మేళనాల ప్రభావాన్ని నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు.