Sesame Seeds Laddu Health Benefits :పిల్లలు ఎదిగే క్రమంలో వారికి సరైన పోషకాహారం అందించడం చాలా అవసరం. అలా అందించినప్పుడే వారు శారీరకంగా, మానసికంగా ధృడంగా తయారవుతారు. ఈ క్రమంలోనే చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలకు ఎలాంటి ఫుడ్ చేసి పెడితే ఎక్కువ పోషకాలు అంది ఆరోగ్యవంతంగా, బలంగా తయారవుతారని ఆలోచిస్తుంటారు. మీరూ అలా ఆలోచిస్తున్నారా? అయితే, ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే నువ్వుల(Sesame Seeds) లడ్డు తయారు చేసి పెట్టండని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ, నవ్వుల లడ్డు పిల్లల డైట్లో చేరిస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నువ్వుల లడ్డుతో పిల్లలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన మూలకాలు పుష్కలంగా ఉన్న నువ్వులు.. ఎదుగుతున్న పిల్లలలో బలమైన ఎముకల అభివృద్ధికి తోడ్పడతాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. వీటిలో ఉండే మోనో అసంతృప్త కొవ్వులు వారి మెదడు అభివృద్ధికి, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు. నువ్వులలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల పెరుగుదల, కండరాల అభివృద్ధికి సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే నువ్వులు.. పిల్లల్లో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా బలమైన రోగనిరోధక శక్తిని ప్రోత్సహిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అదేవిధంగా నువ్వులలోని పోషకాలు వారికి సహజమైన శక్తిని అందిస్తూ రోజంతా యాక్టివ్‌గా ఉండడానికి సహాయపడతాయి. అలాగే సీసమ్ సీడ్స్‌లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చిన్నారుల్లో జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నువ్వులను మీ పిల్లలకు ఇలా లడ్డూల రూపంలో చేసి అందిస్తే ఎంతో ఇష్టంగా తినడం పక్కా! అంటున్నారు నిపుణులు.