These Foods Avoided For Gut Health : మనకి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా అది పొట్ట నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి, పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇందుకోసం మంచి ఫుడ్ తినాలని, వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. కానీ.. ఇవి చేసినా కూడా పొట్టలో సమస్య ఉందంటే అర్థం.. మనసు బాగోలేదని! అవును.. మనసు ఆందోళనగా ఉంటే మొట్ట మొదటగా దాని ప్రభావం పొట్టపై పడుతుంది. అజీర్తి నుంచి, గ్యాస్ట్రిక్, అల్సర్ దాకా అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే.. పొట్ట "సెకండ్ బ్రెయిన్" కాబట్టి!
చాలా మందికి ఈ విషయం తెలియదు. మన బ్రెయిన్లో ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు మొదటగా స్పందించేది పొట్ట మాత్రమే! అందుకే గమనించండి.. మనం ఎప్పుడైనా ఒత్తిడికి(Stress)లోనైనప్పుడు స్టమక్ ఇబ్బందిగా మారుతుంది. ఎవరిమీదనైనా కోపం వస్తే.. ఎసిడిటీ రావడాన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అందుకే.. పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుకోవచడానికి.. మనసు సంతోషంగా, కూల్‌గా ఉంచుకోవడం చాలా అవసరమని చెబుతున్నారు నిపుణులు. ఇది చాలా చాలా అవసరమని సూచిస్తున్నారు. దీంతోపాటుగా మీ సెకండ్ బ్రెయిన్ హెల్తీగా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే అవి పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటున్నారు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చక్కెర పదార్థాలు : మీ పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా వీలైనంత వరకు చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. చక్కెర అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాకు నష్టం కలిగించి, చెడు బ్యాక్టీరియా వృద్ధికి దోహదం చేస్తుందంటున్నారు. దీని కారణంగా గ్యాస్, అల్సర్లు వంటి పలు ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు. కాబట్టి, పొట్ట ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే.. చక్కెర అధికంగా ఉండే ఫుడ్స్‌కు దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
2017లో 'జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. అధిక చక్కెర ఉండే ఆహారం తినే వ్యక్తులు తక్కువ మంచి బ్యాక్టీరియా, ఎక్కువ చెడు బ్యాక్టీరియా కలిగి ఉన్నారని కనుగొన్నారు. అలాగే ఈ వ్యక్తులు మధుమేహం, గుండె జబ్బులకు గురయ్యే ప్రమాదం ఎక్కువని తేలింది. ఈ పరిశోధనలో షాంఘై జియావోటాంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ జూన్ జాంగ్ పాల్గొన్నారు. చక్కెర ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం చెడు బ్యాక్టీరియా వృద్ధి చెంది వివిధ జీర్ణ సమస్యలకు దారితీయవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ : చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలు హెల్త్‌కి మంచిది కాదన్న కారణంతో.. వాటికి బదులుగా ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ డైట్లో యాడ్ చేసుకుంటారు కొంతమంది! కానీ.. ఇవి కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇవి రోగ నిరోధక శక్తిపై, పొట్టలోని మంచి బ్యాక్టీరియాపై తీవ్ర ప్రభావం చూపిస్తాయంటున్నారు. కాబట్టి, వీటికీ వీలైనంత దూరంగా ఉండడం బెటర్ అంటున్నారు.