Snoring Remedy at Home: ఈ మధ్య కాలంలో చాలా మంది గురక సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గురక వల్ల పక్కన పడుకున్న వారికి సరిగ్గా నిద్రపట్టక ఇబ్బందులు పడుతుంటారు. అయితే, శ్వాసమార్గం సన్నబడడం, కఫం పెరగడమే గురక సమస్యకు ప్రధాన కారణమని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవి అంటున్నారు. దీంతో ఈ సమస్యను తగ్గించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కేవలం ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈజీగా ఔషధం చేసుకోవచ్చని వివరిస్తున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 20 గ్రాముల శొంఠి చూర్ణం
- 20 గ్రాముల పిప్పళ్ల చూర్ణం
- 20 గ్రాముల మిరియాల చూర్ణం
- 10 గ్రాముల దాల్చిన చెక్క చూర్ణం
- 10 గ్రాముల యాలకుల చూర్ణం
- 30 గ్రాముల తాలీసపత్రి చూర్ణం
తయారీ విధానం
- ఇందుకోసం ఓ గిన్నెను తీసుకుని అందులో శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, తాలీసపత్రి చూర్ణం వేసి బాగా కలపాలి.
- దీనిని ఇలా మెత్తగా చేసుకోని ఓ గాజు సీసాలో భద్రపరుచుకోవాలని వివరిస్తున్నారు.
- గురక సమస్య ఉన్నవారు భోజనం చేసిన అరగంట తర్వాత ఒక చెంచా పరిమాణంలో తీసుకుని అందులో కొంచె తేనె కలిపి నిద్రపోయే గంట ముందు తీసుకోవాలని సూచిస్తున్నారు.
శొంఠి: ఇది శ్వాసమార్గం సన్నబడకుండా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు కఫదోషాన్ని కూడా తొలగిస్తుందని వివరిస్తున్నారు. ఇంకా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
పిప్పళ్లు: కారంగా ఉండే ఈ పిప్పళ్లు కఫాన్ని తగ్గించడంలో సాయం చేస్తుందని చెబుతున్నారు. ఇది శరీరానికి మంచి టానిక్‌లాగా పనిచేస్తుందని వివరిస్తున్నారు.
మిరియాలు: మనలో చాలా మంది గొంతు సమస్యలకు మిరియాలను వాడుతుంటారు. అయితే, ఇందులో గొంతులో కఫం సమస్యను తొలగించే గుణాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు.
దాల్చిన చెక్క: గొంతుతో పాటు శరీరంలోని ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో దాల్చిన చెక్క ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా కఫాన్ని తగ్గించడంతో పాటు జీర్ణశక్తిని పెంచుతుందని అంటున్నారు.
యాలకులు: దీనికి కఫ దోషాన్ని తగ్గించే గుణం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుుతున్నారు. ఇంకా గొంతులోని ఎలర్జీలను తగ్గించి.. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందని వివరిస్తున్నారు.
తాలీసపత్రి: గొంతులో ఉండే కఫాన్ని తగ్గించేందుకు చక్కగా ఉపయోగపడుతుందని గాయత్రీ దేవి చెబుతున్నారు. దీంతో పాటు ముక్కులో ఉండే సమస్యలను తగ్గిస్తుందని వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
చైనా కొత్త వైరస్ ఎలా సోకుతుంది? లక్షణాలు ఏంటి? నివారణ ఎలా? చికిత్స ఏదైనా ఉందా?
ఒక్క శనగపిండితో ఎన్ని లాభాలో మీకు తెలుసా? మొటిమలు, చుండ్రు సమస్యలకు చెక్!