Gastric Problem Solution in Telugu: మనలో చాలా మంది గ్యాస్, ఎసిడిటీ సమస్యతో ఇబ్బందులు పడుతుంటారు. ఫలితంగా ఛాతీలో నొప్పితో, గుండె పట్టేసినట్లుగా అనిపించి ఆందోళ చెందుతుంటారు. మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఇందుకోసం ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది? దీనిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలో ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జానకీ శ్రీనాథ్ వివరిస్తున్నారు.
బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్, పీహెచ్ హై లోడింగ్, ఒత్తిడితో కూడిన ఉద్యోగం లాంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుందని డాక్టర్ జానకీ శ్రీనాథ్ చెబుతున్నారు. బిర్యానీ లాంటివి తీసుకుంటే నూనెతోపాటు ప్రొటీన్ అధికంగా చేరి జీర్ణవ్యవస్థ మీద అధిక భారం పడుతుందని వివరిస్తున్నారు. ఇంకా అది జీర్ణం కావడానికి ఎక్కువ మోతాదులో యాసిడ్‌లు విడుదలవుతాయని అంటున్నారు. ఇలాంటి ఆహారం తరచూ ఎక్కువగా తీసుకుంటే కడుపులో గ్యాస్ తయారై, ఛాతీ నొప్పి వస్తుందని వెల్లడిస్తున్నారు. ఇంకా సమయానికి తినకపోయినా కూడా నొప్పి రావొచ్చని అభిప్రాయ పడుతున్నారు. అయితే, కొన్ని పరీక్షల ద్వారా ఏ కారణం వల్ల ఈ సమస్య వస్తుందో డాక్టర్లు గుర్తించగలరని పేర్కొన్నారు. వీటితో పాటు ఆహారంలో మార్పులు అవసరమని సూచిస్తున్నారు.
"మిరప, గరమ్ మసాలా, కాఫీ ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే ఆయిల్, ప్రోటీన్ అధికంగా ఉన్న మటన్, చికెన్, గ్రేవీ కర్రీ, నట్స్ ఉపయోగించి చేసిన మసాలా కర్రీ లాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తినకూడదు. ఇలా తింటే వీటిలో ఎక్కువగా ఉండే కొవ్వులు జీర్ణవ్యవస్థపై అధిక శ్రమ పడేలా చేస్తాయి. అలాంటప్పుడు అవసరానికి మించి యాసిడ్ ఉత్పత్తి జరిగి ఛాతీలో నొప్పి వస్తుంది. అయితే, జీవనశైలి, ఆహారంలో మార్పుల ద్వారా సమస్యని పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా నడుము కొలత మగవాళ్లలో 90 సెం.మీ, ఆడవాళ్లలో 80 సెం.మీ. కంటే ఎక్కువ ఉండకూడదు. కొంత మందిలో నడుము, పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువ చేరి సెంట్రల్ ఒబెసిటీ వస్తుంది. ఫలితంగా జీర్ణకోశం, పేగుల మీద కొవ్వు పేరుకుని జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బ తింటుంది."
--డాక్టర్ జానకీ శ్రీనాథ్, పోషకాహార నిపుణులు
ఇంకా కాలేయంలో, పాంక్రియాస్‌లో కొవ్వు ఎక్కువైనా కూడా సులభంగా జీర్ణం కాదని జానకీ శ్రీనాథ్ చెబుతున్నారు. కాబట్టి అదనపు బరువు, నడుము కొలత తగ్గించుకోవాలని వెల్లడిస్తున్నారు. ఇందుకోసం శుభ్రమైన, తాజా ఆహారాన్నే తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇంకా జీర్ణవ్యవస్థపై అధిక భారం పడకుండా ఎక్కువ సార్లు.. తక్కువ తక్కువగా తినాలని సూచిస్తున్నారు. ఆహారం పొట్టలోకి పోవడానికి గురుత్వాకర్షణ బలం ఉండాలని.. అందుకోసమే తిన్నాక 10 - 15 నిమిషాల పాటు నడవాలని అంటున్నారు. ఇంకా రోజులో కనీసం 10వేల అడుగులు వేయాలని తెలిపారు. వీటితోపాటు ఏం తిన్నప్పుడు సమస్య వస్తుందో పరిశీలించుకుని కూడా మార్పులు చేసుకోవాలని పేర్కొన్నారు. మీ అభిరుచులూ, సామర్థ్యం మేరకు కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినడానికే చూడాలని వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
గురకతో నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? ఇంట్లోని పదార్థాలతో ఈజీగా పరిష్కారం!
ఒక్క శనగపిండితో ఎన్ని లాభాలో మీకు తెలుసా? మొటిమలు, చుండ్రు సమస్యలకు చెక్!