Interesting Facts About Sleep : ఎంత అభివృద్ధి చెందినా మానవ శరీరం గురించి మనకు ఇంకా ఎన్నో తెలియని విషయాలు ఉంటూనే ఉన్నాయి. ప్రతి పరిశోధనలోనూ ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూనే ఉంటాం. అయితే నిద్రలో మనకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు జరగుతాయని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు బదిరులకు సైన్ లాంగ్వేజ్ ఉంటుందని తెలుసు కానీ అది వారు నిద్రలో ఉపయోగిస్తారని మనం ఊహించం. అలాగే మంచి కంటే చెడు కలలను మనం ఎక్కువ గుర్తు పెట్టుకుంటాం.
నిద్రలో సైన్ లాంగ్వేజ్
వినికిడి మనకున్న ఒక గొప్ప వరం. ప్రకృతిలో ప్రతి శబ్దానికీ ఓ శక్తి ఉంది. దాన్ని విని అనుభవించాల్సిందేగానీ మాటల్లో వర్ణించలేం. అందుకే వినికిడి లోపం అనేది బాధాకరమైన విషయం. వినికిడి లేకపోతే జీవితం నిశ్శబ్దం, నిస్సారంగా సాగిపోతుంది. అయితే 5 సంవత్సరాల వరకు వినికిడి శక్తి ఉండి తరువాత కొద్దికొద్దిగా ఆ శక్తి తగ్గిపోయిన వారు కలలలో మాత్రం శబ్దాలను వింటారని నిపుణులు అంటున్నారు. అంతే కాదు ముందు నుంచి బదిరులుగా ఉన్న వ్యక్తులు నేర్చుకోకపోయినా నిద్రలో సైన్ లాంగ్వేజ్ ఉపయోగిస్తారని చెబుతున్నారు.
ఆ కలలనే గుర్తుపెట్టుకుంటాం
మరో ఆశ్చర్యకరం అయిన విషయం ఏంటంటే మనం ప్రశాంతంగా నిద్ర పోయినప్పుడు వచ్చే కల కన్నా అసలు సరిగా నిద్ర లేనప్పుడు వచ్చే కలలు ఎక్కువగా గుర్తు పెట్టుకుంటాం. అంటే ఏ కల అయితే మనల్ని బాధపెట్టి , ఇబ్బంది పెడుతుందో అదే మనకు బాగా గుర్తు ఉంటుంది. నిజానికి ప్రతి పది మందిలో ఒకరిని పీడ కలలు వెంటాడుతుంటాయి. పీడకలలు రావడానికి ఆ మనిషి మానసిక స్థితే ముఖ్య కారణం . అధిక భావోద్వేగాలకు గురవుతున్న, తీవ్రంగా ఆలోచిస్తున్న, అధిక ఒత్తిడికి బాధపడుతున్న వ్యక్తుల్లో పీడకలలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీరికి ఒత్తిడి వల్ల సరైన నిద్ర పట్టదు. దీంతో పీడ కలలు వస్తాయి. వచ్చిన కల మరచిపోలేక పోవటం వల్ల తరువాత కాసేపటివరకు నిద్ర పట్టదు.