Health Benefits of Donkey Milk : "గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైన నేమి ఖరము పాలు" అన్న పద్యం.. ఇప్పుడు రివర్స్ అయ్యింది. గరిటెడైనా చాలు ఖరము పాలు అను పాడుకుంటున్నారు! అవును.. గాడిద పాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మరి, గాడిద(Donkey)పాలకు ఎందుకంత డిమాండ్ ఏర్పడింది? అవి తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గాడిద పాలకు అంతటి డిమాండ్ ఏర్పడడానికి ప్రధాన కారణం.. అందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో జౌషధ గుణాలు ఉండడమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదు.. వీటిలో చర్మ సౌందర్యానికి తోడ్పడే అనేక గుణాలున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే అనేక రకాల బ్యూటీ ఉత్పత్తులలో గాడిద పాలను ఉపయోగిస్తున్నారట. అంతేకాదు.. ఆవు, గేదె, మేక, ఇతర పాడి జంతువుల పాలతో పోలిస్తే గాడిద పాలలో.. తల్లి పాలలో ఉండే పోషకాలు ఉన్నట్లు పలు పరిశోధనలు వెల్లడించాయి. అందుకే, మన పూర్వీకులూ పసిపిల్లలకు గాడిద పాలు తాగించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నమ్మేవారట.
అయితే, గాడిద పాలకు డిమాండ్ పెరగడానికి ఇవి మాత్రమే కాదు.. పాల ఉత్పత్తి మరో కారణంగా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. ఒక్కో గాడిద రోజుకు కేవలం 4 కప్పుల పాలను మాత్రమే ఇస్తుందట. అందుకే.. వీటి ధర ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే.. గాడిద పాలు తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు చూద్దాం.
- గాడిద పాలలో తల్లి పాలు, ఆవు పాలతో సమానమైన ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయట. అందుకే ఈ పాలు శిశువులకు పట్టించడం మంచివంటుంటారని నిపుణులు చెబుతున్నారు.
- ఈ పాలల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇవి తాగడం వల్ల శరీరానికి లాక్టోస్ రూపంలో కావాల్సిన కేలరీలు అందుతాయంటున్నారు నిపుణులు.
- ఇన్ఫెక్షన్లూ, కోరింత దగ్గు, ఆర్థరైటిస్, వైరల్ జ్వరాలు, ఆస్తమా, గాయాలు నయం చేసేందుకు గాడిదపాలను మందుగా వాడుతుంటారని నిపుణులు సూచిస్తున్నారు.
- ముఖ్యంగా ఈ పాలలో యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు అంటువ్యాధులు, బ్యాక్టీరియా, ఇతర వైరస్లు సోకకుండా కాపాడతాయంటున్నారు.
- నిద్రలేమి, ఎసిడిటీతోపాటు ఎగ్జిమా, సిఫిలిస్, స్కాబిస్, దురద, తామర... వంటి ఇన్ఫెక్షన్లకి గాడిద పాలు మంచి ఔషధమని చెబుతున్నారు నిపుణులు.
- ముఖ్యంగా గాడిద పాలు.. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో చాలా బాగా సహాయపడతాయని నిపుణులంటున్నారు.
- అంతేకాదు.. ఇందులోని పోషకాలు రక్తపోటు తగ్గించడంలో ఉపయోగపడతాయట. అలాగే ఈ పాలలో ఉండే లాక్టోస్ ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.