Dog Bite Treatment in Telugu : విశ్వాసానికి మారు పేరుగా చెప్పే కుక్కలు కొన్నిసార్లు కరిచే అవకాశం ఉంటుంది. అవి పెంచుకునే కుక్కలు అయినా లేదంటే వీధి కుక్కలు అయినా కరిస్తే ప్రమాదమే. కుక్కలు కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు చేయించుకోవాలని అంటూ ఉండటం మనం వింటూనే ఉంటాం. కుక్క కరిచినప్పుడు చేయాల్సిన ప్రథమ చికిత్స ఏంటి? ఎలాంటి తప్పులు చెయ్యకూడదు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
వ్యాక్సిన్ వేయించడం ముఖ్యం
కుక్క కాట్లను వాటి స్వభావాన్ని బట్టి మూడు రకాలుగా విభజించారు. రక్తం రాకుండా గీరడం లేదా కొరకడం, రక్తం వచ్చేలా కొరకడం, తీవ్రస్థాయిలో గాయపర్చడం. ఇందులో మొదటి రకం కుక్క కాటు వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. అయినా కానీ జాగ్రత్త పాటించడం ఉత్తమం. సాధారణంగా ఇంట్లో పెంచుకునే కుక్కలు రక్తం రాకుండా గీరడం లేదంటే కొరకడం చేస్తుంటాయి. పుండు లేదా గాయం లేని చోట నాకినా ఎలాంటి ప్రమాదం ఉందడు. ఈ రకమైన కాట్ల వల్ల రేబిస్ వచ్చే అవకాశాలు అతి తక్కువ. ఒకవేళ ఇంట్లో పెంపుడు కుక్క ఉంటే మాత్రం దానికి టీకా వేయించడం ఉత్తమం. కొన్నిసార్లు పెంపుడు కుక్కలు గాయాలు, పుండ్లు ఉన్న చోట నాకుతుంటాయి. రక్తం వచ్చేలా కొరుకుతుంటాయి. ఈ సందర్భంలో రేబిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మెడ, ముఖం, తల, అరచేతులు, చేతివేళ్ల మీద కరిస్తే రేబిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటికి వెంటనే ప్రథమ చికిత్స, వైద్యం అవసరం.
కుక్క కరిస్తే ఇలా చేయాలి
కుక్క కరిచినపుడు ధారగా పడుతున్న నీటితో 15 నిమిషాల పాటు గాయాన్ని కడగాలి. దీని వల్ల కుక్క లాలాజలం శరీరంలోకి ప్రవేశించకుండా, రేబిస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. యాంటీసెప్టిక్ లోషన్‌తో శుభ్రం చేయాలి. ఆ తర్వాత వైద్యుల దగ్గరకు తీసుకెళ్లి వ్యాక్సిన్ వేయించాలి. కుక్క కరిస్తే చాలామంది గాయాన్ని చేతితో ముట్టుకుంటూ ఉంటారు. ఇలా ఎంతమాత్రం మంచిది కాదు. గాయాన్ని నేరుగా చేతులతో ముట్టుకోకుండా చేతులకు గ్లౌజ్‌లు వేసుకొని ముట్టుకోవాలి. గాయం పెద్దగా అయితే కానీ కుట్లు వేయకూడదు. ఒకవేళ కుట్లు తప్పనిసరి అయినా వాటిని వదులుగా వెయ్యాలని గుర్తించుకోవాలి.