Free Training In cab driving : ఈ అత్యాధునిక యుగంలో యుద్ధ విమానాలను నడిపే స్థాయికి నేటి యువతులు ఎదిగారు. ఒకవైపు దేశాభివృద్ధికి బాటలు, ఇటు వృత్తికి సంతృప్తి దారులను ఏర్పర్చుకుంటున్నారు. ఎవరైనా ఏదైనా నేర్పిస్తే ఎంతో ఆసక్తితో, ఏకాగ్రతతో నేర్చుకొని కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు ఆ యువతులు. క్యాబ్‌లను నడుపుతూ ఆదాయం సముపార్జించుకోవడానికి సాధారణంగా మహిళలు వివిధ కారణాలతో ఆసక్తి చూపరు. కానీ కొందరు మాత్రం షీ-క్యాబ్‌లను నడిపిస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొందరు కారు డ్రైవింగ్‌లో సంగారెడ్డిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రం (ఎస్‌బీఐఆర్‌ఎస్‌ఈటీఐ) ద్వారా తర్ఫీదును పూర్తి చేసుకున్నారు.
ఉచిత వసతి, భోజనంతో కూడిన శిక్షణ : 2010లో సంగారెడ్డిలో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన యువతులకు భోజనం, వసతితో కూడిన నెల రోజులు శిక్షణ ఇస్తున్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదివిన లేదా చదువు మధ్యలో మానేసిన వారికి పలు కోర్సుల్లో శిక్షణను ఇస్తూ స్వయం ఉపాధికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే తొలి విడతలో 25 మందికి కారు డ్రైవింగ్ ట్రైనింగ్ ఇచ్చారు.
తాజాగా 33 మందికి శిక్షణ ఇవ్వగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. జిల్లాకు సమీపంలోనే హైదరాబాద్ నగరం ఉండటంతో పలు కంపెనీలు, కార్పొరేట్ సంస్థల్లో మహిళలు విధులకు ప్రయాణాలు సాగిస్తుంటారు. రాత్రిపూట మహిళ ఉద్యోగులకు యువతులు నడిపించే క్యాబ్ నమ్మకంగా, ధైర్యంగా ఉంటుంది.
"మాది సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలం జమ్లా తండా. పదో తరగతి వరకు చదువుకున్నాను. భర్త కిషన్, 4 సంతానం ఉన్నారు. మాది వ్యవసాయ కుటుంబం. డీఆర్‌డీఏ ద్వారా ట్రైనింగ్ గురించి తెలుసుకుని శిక్షణ కేంద్రంలో చేరాను. రాయితీలపై కారును బ్యాంకు లోన్ ద్వారా ఇప్పించి ఆదుకోవాలి. ఇతర యువతులకు సైతం శిక్షణ ఇస్తా. నేను సంగారెడ్డి బైపాస్ నుంచి జిల్లా కలెక్టర్‌ను క్యాంప్ ఆఫీస్ వరకు కారు నడిపిస్తూ తీసుకెళ్లడం చాలా ఆనందంగా ఉంది. గణతంత్ర దినోత్సవం రోజు కవాతు మైదానంలోనూ వాహనాన్ని నడిపించా. శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడం జీవితంలో మరిచిపోలేని గొప్ప అనుభూతి"- లక్ష్మీబాయి, శిక్షణ పొందిన యువతి
స్వయం ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి : ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని శిక్షణ కేంద్రం డైరెక్టర్ వంగ రాజేంద్ర ప్రసాద్ సూచించారు. వాటి ద్వారా పలువురికి ఉపాధిని కల్పించొచ్చన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న అంశాలపై కల్పిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉపాధితో తమ కాళ్లపై తాము నిలబడాలని కోరారు.
గుడ్‌న్యూస్ : బీసీ స్టడీ సర్కిళ్లలో ఆర్‌ఆర్‌బీ, ఎస్ఎస్‌సీ, బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌కు ఫ్రీ కోచింగ్!
ఉచిత నైపుణ్య శిక్షణతో భవిష్యత్‌కు బంగారు బాటలు - నిరుద్యోగుల పాలిట వరంగా 'స్కిల్ ట్రైనింగ్'