New IT Parks in Hyderbad : హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొత్తగా మరో రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్లో రూ. 100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన డ్యూ సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రతినిధులతో సచివాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యరు.
హైటెక్ సిటీ తరహాలోనే : ఐటీ రంగంలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని శ్రీధర్ బాబు తెలిపారు. హైటెక్ సిటీ తరహాలోనే కొత్తగా మరో రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, వీటిని ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలి? నగర శివారుల్లో ఏయే ప్రాంతాలు ఇందుకు అనుకూలంగా ఉన్నాయనే దానిపై సంబంధిత యంత్రాంగం అధ్యయనం చేస్తోందని శ్రీధర్ బాబు వెల్లడించారు.
పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతున్నారు : ఐటీ పార్కుల్లో పనిచేసే ఉద్యోగులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని, రవాణా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఎక్కడి నుంచైనా ఈ పార్కులకు చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ పార్కుల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలకు అవకాశం కల్పిస్తామన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పరిశ్రమలకు భూకేటాయింపులపై ఇప్పటీ వరకు ప్రత్యేక పాలసీ అంటూ ఏదీ లేదని దీని వల్ల పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతున్నారన్నారు.
ఉద్యోగాల సంఖ్య ఆధారంగానే భూ కేటాయింపు : అందుకే ప్రత్యేక పాలసీని రూపొందించాలని నిర్ణయించామని పెట్టుబడితో పాటు కల్పించే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా భూమిని కేటాయిస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్లో రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన డ్యూ సాఫ్ట్ వేర్ కంపెనీని సంతోషంగా ఆహ్వానిస్తున్నామని, ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు. రాబోయే ఐదేళ్లలో ఈ సంస్థ 900 మందికి ఉపాధి అవకాశాలను కల్పించనుందని శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ కంపెనీలను విస్తరించడానికి ఐటీ కంపెనీలతో చర్చలు జరుపుతామని ఈ మేరకు మంత్రి స్పష్టం చేశారు.