Gynecologist Praneetha Try to Die : అత్తమామల వేధింపులతో ఓ డాక్టర్ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగింది. ఫెర్నాండెజ్ ఆసుపత్రిలో గైనకాలజీ డాక్టర్‌గా పని చేస్తున్న డా.ప్రణీతకు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న సికిందర్‌తో 2018లో పెళ్లి అయింది. వీరికి మూడేళ్ల పాప. మొదట అమెరికాలో ఉన్న వీరు 2021లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ప్రస్తుతం చంపాపేట్‌లోని ప్రెస్ కాలనీలో అత్తమామలతో ఉంటున్నారు.
అత్తమామల వేధింపులు : ఇద్దరి మధ్య గొడవలు తలెత్తడంతో విడాకులకు అప్లై చేసుకున్నారు. ఈ గొడవల కారణంగా భర్త ఎక్కడికో వెళ్లిపోయాడు. ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో ఉంది. ప్రస్తుతం చంపాపేటలోని ఇంట్లోపై పోర్షన్లో అత్తమామ ఉండగా కింద పోర్షన్లో ప్రణీత ఆమె కూతురు, తోడుగా తల్లి రూప ఉంటున్నారు. ఇటీవల అత్తా కోడలికి తరచూ గొడవలు జరుగుతున్నాయి. అత్తమామల వేధింపుల కారణంగా ప్రణీత పలుమార్లు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు సరిగా స్పందించలేదని బాధితురాలి బంధువులు ఆరోపించారు.
గుర్తు తెలియని టాబ్లెట్లు వేసుకున్న ప్రణీత : సోమవారం రాత్రి మళ్లీ గొడవ జరగడంతో ప్రణీత సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అయితే సీఐ తమ సమస్యను పట్టించుకోలేదని, అత్తమామ ఇంట్లో ఎందుకు, వేరుగా ఉండొచ్చు కదా అన్ని సలహా ఇచ్చాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రణీత ఇవాళ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది తెలుసుకున్న తల్లి రూప వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స చేస్తున్నారు.
సరూర్‌నగర్ పీఎస్ ముందు ధర్నా : సీఎం సెక్యూరిటీ ఆఫీస్‌లో ఉన్న ఓ అధికారి తరచూ పోలీసులకు ఫోన్ చేసి అత్తమామలకు సపోర్ట్ చేస్తున్నాడని ప్రణీత కుటుంబ సభ్యులు ఆరోపించారు. పుట్టిన రోజు ఆత్మహత్యాయత్నకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణీత ఆత్మహత్య నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు వారి ఇంటి ముందు, నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సరూర్‌నగర్ పీఎస్ ముందు ధర్నాకు దిగారు.
హనుమకొండ జిల్లాలోని గోపాల్‌పూర్‌లో దారుణం - భరత్ అనే యువకుడి గొంతుకోసిన ఓ బాలిక తండ్రి