Sandhya Theatre stampede Incident : పుష్ప-2లో బెనిఫిట్ షో సందర్బంగా డిసెంబర్ 4న రాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఇప్పటికే చాలా మంది మర్చిపోయారు. కానీ ఘటనలో కుంటుంబంతో సినిమాకు వచ్చిన రేవతి (32) అక్కడిక్కడే మృతి చెందగా తన తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రికే పరిమతమయ్యాడు. ఇది జరిగి 56రోజులు గడిచినప్పటికీ బాలుడి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు.
కిమ్స్ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స : తొక్కిసలాట తర్వాత బాలుడిని పక్కకు తీసుకెళ్లిన పోలీసులు సీపీఆర్ చేసి వెంటనే సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజులపాటు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.ఆ తర్వాత సొంతంగా ఆక్సిజన్ పీల్చుకోవడంతో వెంటిలేటర్‌ను తొలగించి ప్రత్యేక గదికి మార్చారు. అప్పటి నుంచి శ్రీతేజ్ ఆసుపత్రిలోని బెడ్‌కే పరిమితమయ్యాడు. పేరిపెట్టి పిలిచినా కళ్లు తెరిచి చూడటం లేదు. నోరు విప్పి ఏం మాట్లాడలేడు. ఇప్పటి వరకు ముక్కు వద్ద అమర్చిన సన్నని గొట్టం ద్వారానే లిక్విడ్ ఆహారం అందిస్తున్నారు.
56 రోజులుగా మంచానికే పరిమితమైన శ్రీతేజ్ : వైద్య సిబ్బంది ఆ చిన్నారి కోలుకోవడానికి ఫిజియోథెరపీ చేస్తున్నారు. అయినా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. అతడు ఎప్పుడు కోలుకుంటాడనే విషయం వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారు. శరీరంలో ఇతర జీవ ప్రక్రియలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ శ్రీతేజ్ నుంచి స్థిరమైన ప్రతిస్పందనలు ఉండటం లేదని కిమ్స్ వైద్యులు డాక్టర్ చేతన్, డాక్టర్ విష్ణుతేజ్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు : ఆరోజు బాలుడిని జనం తొక్కుకుంటూ పోవడంతో కొంత సమయం పాటు అతని ఊపిరి ఆగిపోయింది. సీపీఆర్‌తో తిరిగి శ్వాస అందుకున్నాడు. దీనికి ప్రభుత్వం స్పందించి బాలుడికి చికిత్స అందిస్తుంది. సినిమా ప్రముఖులు సైతం సాయం చేశారు. ఎన్ని చేసినా శ్రీతేజ్ మాత్రం ఎప్పుడు కోలుకుంటాడో మళ్లీ బడికి ఎప్పుడు వెళతాడో, డాన్స్ ఎప్పుడు చేస్తాడో అని అతని తండ్రి, చెల్లెలు ఆశగా ఎదురుచూస్తున్నారు.