Garlic Benefits in Telugu: మనం ప్రతి కూరలోనూ వెల్లుల్లిని ఏదో రకంగా వాడుతుంటాం. ఇది ఘాటుగా ఉండి వంటకాలకు రుచిని అందిస్తుంది. అయితే, కేవలం రుచి మాత్రమే కాకుండా వెల్లుల్లి వాడకం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు డాక్టర్ అంజలీ దేవి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
"వెల్లుల్లిలో అనేక యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు ఉన్నాయి. మనం తీసుకున్న ఆహార పదార్థాల్లోని బ్యాక్టీరియాను శరీరంలోకి రాకుండా వెల్లుల్లి సాయం చేస్తుంది. ఇంకా అధిక రక్త పోటు, కొలెస్ట్రాల్ స్థాయులను అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా గుండె, షుగర్ వ్యాధిగ్రస్థులకు వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. పాలిచ్చే తల్లులు వెల్లుల్లి తీసుకోవడం వల్ల పాలు ఎక్కువగా వస్తాయి. ఇంకా అనేక ఔషధాల తయారీలోనూ వాడుతుంటారు."
--డాక్టర్ అంజలీ దేవి, పోషకాహార నిపుణులు
ఇంకా వెల్లుల్లి జీర్ణక్రియలో తోడ్పడి.. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే బరువు నియంత్రణలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందని వివరిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచి.. తద్వారా రకరకాల ఇన్‌ఫెక్షన్లకు చెక్ పెడుతుందని అంటున్నారు. ఫలితంగా జ్వరం, దగ్గు, జలుబులను దరి చేరనీయదని వివరిస్తున్నారు. ఇంకా తేనెలో కొన్ని చుక్కల వెల్లుల్లి రసం కలిపి తీసుకుంటే కడుపులోని నులిపురుగులు చనిపోతాయని సూచిస్తున్నారు.
వెల్లుల్లిలో అనేక రకాల పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మాంగనీస్, సెలీనియంలతోపాటు విటమిన్-బి6, సి, పీచు తగిన మొత్తంలో ఉంటుందని వివరిస్తున్నారు. విటమిన్- సి కండరాలు, చర్మం ఆరోగ్యానికి అవసరమయ్యే కొల్లాజెన్‌ని ఉత్పత్తి చేస్తుందంటున్నారు. వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్లు అల్జీమర్స్, డిమెన్షియా లాంటి అనారోగ్యాలను అడ్డుకుంటాయని తెలిపారు. ఇంకా మెగ్నీషియం అధిక మోతాదులో ఉండి.. ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా మహిళల్లో కీళ్లనొప్పులను దూరం చేస్తుందని వివరిస్తున్నారు. ఇందులోని సమ్మేళనాలు కాలేయంలోని విషపదార్థాలను బయటకు పంపుతాయని.. మూత్ర సంబంధ ఇన్‌ఫెక్షన్లను నిర్మూలిస్తాయని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
జస్ట్ 10 నిమిషాలు ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట! స్పాట్ జాగింగ్ గురించి మీకు తెలుసా?
కొవ్వు కరిగి సిక్స్ ప్యాక్ కావాలా? ఖర్చు లేకుండానే ఈజీగా వస్తుందట!