TG High Court on Cinema Theaters : పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే సమయంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 11 గంటల్లోపు, రాత్రి 11 గంటల తరువాత 16 ఏళ్లలోపు పిల్లలను సినిమాలకు అనుమతించరాదని, దీనిపై అన్ని వర్గాలతో చర్చలు జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఉదయం 11 గంటల్లోపు, రాత్రి 11 గంటల తరువాత 16 ఏళ్ల పిల్లలను సినిమాలకు అనుమతించరాదని థియేటర్లకు తెలిపింది.
'గేమ్ ఛేంజర్' సినిమా టిక్కెట్ ధరల పెంపును, అదనపు షోలకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 4 పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ హైకోర్టు గత ఉత్తర్వుల మేరకు బెనిఫిట్ షోకు అనుమతిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పునః సమీక్షించి, ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతించరాదని నిర్ణయం తీసుకుంటూ జనవరి 11న ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రజా ప్రయోజనాలు, ఆరోగ్యం, రక్షణలను పరిగణనలోకి తీసుకునే భవిష్యత్తులో బెనిఫిట్లకు అనుమతించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు.
అయితే సినిమాటోగ్రఫీ నిబంధనల ప్రకారం ఉదయం 8.40లోపు, అర్ధరాత్రి 1.30 గంటల తరువాత సినిమాలకు అనుమతించరాదన్నారు. ముఖ్యంగా మైనర్లను అనుమతించరాదని, లేని పక్షంలో అది వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వివరించారు. మల్టీప్లెక్స్‌ల్లో చివరి షో అర్ధరాత్రి 1.30 గంటల దాకా నడుస్తుందని, ఇందులో మైనర్ల ప్రవేశానికి ఎలాంటి నియంత్రణలు లేవని కోర్టుకు తెలిపారు. పుష్ప-2 ప్రదర్శన సమయంలో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి, బాలుడు తీవ్రంగా గాయపడ్డారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సూచించారు.
రాత్రి 11 తర్వాత పిల్లలకు థియేటర్లకు నో ఎంట్రీ : ఈ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ రాత్రి 11 తరువాత థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లోకి పిల్లలను అనుమతించడం సరైన చర్య కాదన్నారు. దీనిపై అన్ని వర్గాలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు 16 ఏళ్లలోపు పిల్లలను ఉదయం 11లోపు, రాత్రి 11 గంటల తర్వాత సినిమా ప్రదర్శనలకు అనుమతించరాదని థియేటర్ల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. హోంశాఖ కార్యదరి, తెలంగాణ రాష్ట్ర ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తదితరులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఫిబ్రవరి 22వ తేదీకి వాయిదా వేశారు.
'పుష్ప' తీసిన ప్రాణం : సంధ్య థియేటర్‌కు అల్లుఅర్జున్ - తొక్కిసలాటలో మహిళ మృతి