Kharge on BJP-RSS : 'బీజేపీ-ఆర్ఎస్ఎస్ నేతలు దేశ ద్రోహులు, స్వాతంత్ర్యం కోసం ఎటువంటి పోరాటం కూడా చేయలేదని' కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటు విమర్శలు చేశారు. పేదరికం, నిరుద్యోగం నుంచి ప్రజలు విముక్తి పొందాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అన్నారు. సోమవారం మధ్యప్రదేశ్‌లోని మహులో నిర్వహించిన 'జై బాపు, జై భీమ్, జై సంవిధాన్' ర్యాలీలో ఈ మేరకు ఖర్గే వ్యాఖ్యలు చేశారు.
'మతం పేరుతో పేదలను దోపిడి చేయడాన్ని కాంగ్రెస్ ఎన్నటికీ సహించదు. కెమెరాల కోసం పవిత్ర గంగా నదిలో స్నానం చేసేందుకు బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. మహా కుంభమేళాలో స్నానం చేయడం వల్ల పేదరికం అంతం అవుతుందా? నేను ఎవరి విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ప్రశ్నించడం లేదు. ప్రధాని మోదీ చేసే తప్పుడు వాగ్దానాల వలలో ప్రజలు పడకూడదనే చెబుతున్నా. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మనందరం ఐక్యంగా ఉండాలి' అని ప్రజలను ఖర్గే కోరారు.
#WATCH | Indore, MP | Congress National President Mallikarjun Kharge says, " we will not tolerate the exploitation of the poor in the name of religion... vallabhbhai patel gave the order to shut down rss, yet they pit jawaharlal nehru and vallabhbhai patel against each other...… pic.twitter.com/5S9uMvXKSa
— ANI (@ANI) January 27, 2025
'ఎక్కడా ఉపాధి ఉండదు'
మరోవైపు ఇదే ర్యాలీలో బీజేపీ-ఆర్ఎస్ఎస్ నేతలపై లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ విమర్శల వర్షం కురిపించారు. పేదలకు ఎలాంటి హక్కులు లేకుండా, కేవలం ధనికులకు మాత్రమే అన్ని హక్కులను కలిగి ఉండే స్వాతంత్య్రానికి ముందునాటి పరిస్థితులను తిరిగి స్థాపించేందుకు బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఉపాధి అవకాశాలను దూరం చేసి దళిత, బీసీ, గిరిజన వర్గాలను మరోసారి బానిసలుగా మార్చాలని కేంద్రం చూస్తోందని మండిపడ్డారు. దేశ సంపదను కొంతమంది క్రోనీ క్యాపిటలిస్టులకే అప్పగించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ యోచిస్తున్నాయని రాహుల్‌గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను మోదీ సర్కార్ అవమానిస్తోందని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి రాగానే 50శాతం రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని ఎత్తివేయడం సహా కులగణన చేపడతామన్న రాహుల్, కేవలం కొందరికి భయపడి మోదీ క్యాస్ట్ సెన్సస్‌ను చేపట్టడం లేదని ఆరోపించారు.
#WATCH | Indore, MP | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, " who is the owner of the privatisation of the education and health system? the indian education system is a system of stamps, a system of certification. crores of people think that after such certifications,… pic.twitter.com/qT0ZG8UFQH
— ANI (@ANI) January 27, 2025
'విద్యా వైద్య రంగాల ప్రైవేటీకరణకు యజమాని ఎవరు? మన దేశంలో విద్యావ్యవస్థ స్టాంపులు, సర్టిఫికేషన్ల వ్యవస్థలా మారింది. ఆ సర్టిఫికెట్లు పొందిన తర్వాత, లక్షల రూపాయలను కోటీశ్వరులకు చెల్లించిన తర్వాత, తమ పిల్లలకు ఉద్యోగం వస్తుందని కోట్ల మంది ప్రజలు భావిస్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. మీ పిల్లలు ఏం చేసినా ఈ దేశంలో ఉపాధిని పొందలేరు. కోటీశ్వరులు దేశ ఉపాధి వ్యవస్థను ధ్వంసం చేసేశారు. ఐఐటీ, ఐఐఎం విద్యార్థులకే ఉపాధి లభించకపోతే ఇక మిగిలినవారు ఎలా ఉద్యోగాలు సాధిస్తారు?' అని రాహుల్ గాంధీ అన్నారు.