How to Make Kaddu Ki Kheer Recipe in Telugu: మీరు ఎప్పుడైనా హైదరాబాద్ స్పెషల్ కద్దూ కీ ఖీర్ తిన్నారా? పెళ్లిళ్లు, స్పెషల్ పార్టీలకు ఈ ఖీర్‌ను ఎక్కువగా తయారు చేస్తుంటారు. చాలా రుచికరంగా ఉండే దీనిని.. స్వీట్ షాపుల్లో కూడా విక్రయిస్తుంటారు. అయితే, ఎంతో కమ్మగా ఉండే ఈ ఖీర్‌ను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని వేడి వేడిగా లేదంటే ఫ్రిజ్‌లో పెట్టుకోని తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఈ పాయసాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే వారం, పది రోజుల పాటు నిల్వ ఉంటుంది. మరి ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 500 గ్రాముల సొరకాయ తరుగు
- ఒక లీటర్ చిక్కటి పాలు
- 100 గ్రాముల పచ్చి కోవా
- అర కప్పు సగ్గుబియ్యం (అరగంట నానబెట్టిన)
- 50 గ్రాముల జీడిపప్పు పేస్ట్
- 250 గ్రాముల చక్కెర
- ఒక టీ స్పూన్ యాలకుల పొడి
- కొద్దిగా పిస్తా పలుకులు
- కొద్దిగా బాదం పలుకులు
- చిటికెడ్ గ్రీన్ ఫుడ్ కలర్ (ఆప్షనల్)
తయారీ విధానం
- ముందుగా స్టౌ ఆన్ చేసి ఓ గిన్నె పెట్టుకుని అందులో సొరకాయ తురుము వేసి మంట మీడియంలో పెట్టి రెండు నిమిషాలు వేయించుకోవాలి.
- ఆ తర్వాత అందులో అరకప్పు నీళ్లు పోసి అవి ఇంకిపోయి.. సొరకాయ మెత్తగా అయ్యేవరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడ అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకుని అందులో ఒక లీటరు చిక్కటి పాలను పోసి మరిగించుకోవాలి.
- పాలు రెండు పొంగులు వచ్చిన తర్వాత.. అరకప్పు వేడి పాలను ఓ గిన్నెలోకి తీసుకోని అందులో 100 గ్రాముల పచ్చికోవాను వేసుకుని ఎక్కడా గడ్డలు లేకుండా కరిగించుకోవాలి.
- ఇప్పుడు మరుగుతున్న పాలల్లో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకోవాలి. (పాలను ప్రతి 30 సెక్లనకు ఒకసారి కలుపుతూ అంచుల వెంట ఉన్న మీగడను పాలల్లో వేయాలి)
- సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ముందుగా కలిపిపెట్టుకున్న కోవా పాలు, జీడిపప్పు పేస్ట్‌ను వేసుకోని బాగా కలపాలి.
- రెండు నిమిషాల మరిగించిన తర్వాత ముందుగా ఉడికించిన సొరకాయ తురుము వేసి బాగా కలిపి మంటను సిమ్‌లో పెట్టి సుమారు 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- పాలు చిక్కపడిన తర్వాత పావు కిలో పంచదార పోసి చిక్కగా అయ్యే వరకు సుమారు 15 నిమిషాలు ఉడికించుకోవాలి.(మీకు అవసరమైతే చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోవాలి)
- ఆ తర్వాత యాలకుల పొడి వేసుకుని ఓ 5 నిమిషాలు ఉడికించుకోని దింపేసుకోవాలి.
- ఇప్పుడు ఖీర్ పైన నానబెట్టుకున్న బాదం, పిస్తా పలుకులు వేసుకుంటే టేస్టీ కద్దూ కీ ఖీర్ రెడీ!
వీకెండ్ స్పెషల్ : తమిళనాడు ఫేమస్ ఖుస్కా- నాన్ వెజ్ కర్రీలో తింటే సూపర్ టేస్ట్!
అన్నంతో అదిరిపోయే 'చిట్టి ఉల్లిపాయ పులుసు'- కూరగాయలు లేనప్పుడు ఈజీగా చేసుకోవచ్చు!