Benefits Of Breastfeeding :తల్లిగా బిడ్డకు పాలివ్వడం అంత సులువైన పని మాత్రం కాదు. దీని వల్ల మహిళ శరీరంలో చాలా రకాల మార్పులు కలుగుతాయి. ఒంట్లో శక్తి క్షీణించడం సహా చర్మం, కురుల ఆరోగ్యం సన్నగిల్లుతుంది. అందుకనే ప్రస్తుతం చాలా మంది తల్లులు తమ పిల్లలకు పాలు ఇవ్వడం మానేసి, డబ్బా పాలు ఇస్తున్నారు. అయితే దీని వల్ల బిడ్డతో పాటు తల్లి కూడా చాలా రకాలుగా నష్టపోతుందని మీలో ఎంతమందికి తెలుసు.? అవును, తల్లి పాలు చంటిబిడ్డల ఆకలి మాత్రమే తీర్చేవి కాదండీ, వారి ఆయుష్షును కూడా పెంచుతాయట. పసిపిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదాన్ని తల్లిపాల ద్వారా దాదాపు 22 శాతం తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రాక్టికల్‌గా నిరూపితమైంది కూడా. అప్పుడే పుట్టిన శిశువులు తల్లి పాలు తప్పించి నీళ్లు, ఇతర ఆహార పదార్థాలు తీసుకోని పక్షంలో వారిలో మరణం సంభవించే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తెలింది. తల్లిపాల ప్రయోజనాల గురించి అందరికీ తెలిసేలా ఈ విషయాన్ని చేరవేయాలని నిపుణులు సలహాలిస్తున్నారు.
తల్లి పాల వల్ల కలిగే మరిన్ని లాభాలు
బ్రెస్ట్ ఫీడింగ్ (తల్లి పాలు)లో పూర్తి పోషకాలతో పాటు బిడ్డకు చక్కటి ఆరోగ్య భద్రత ఉంటుందట. పిల్లలు చక్కగా నవ్వుతూ ఉండాలంటే వారు ఆరోగ్యంగా ఉండాలి కదా. అందుకే వారికి పుట్టినప్పటి నుంచి కచ్చితంగా ఆరు నెలల వరకూ తల్లిపాలు ఇవ్వడం మరిచిపోకండి. ఆ తర్వాత రెండేళ్ల వయస్సు వచ్చే వరకూ తల్లిపాలతో పాటు ఇతర న్యూట్రియంట్ ఫుడ్ ఇస్తే ఇంకా ఆరోగ్యంగా ఉంటారు.
చాలా మంది ఈ విషయాలేమీ తెలుసుకోకుండా రెగ్యూలర్ పనుల్లో బిజీ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరు దీనిపై అవగాహన తెచ్చుకుంటే, పిల్లలు ఎదిగిన తర్వాత కూడా జబ్బులు పడే ప్రమాదం తక్కువగా ఉంటుందట. తల్లి పాలను ఎక్కువగా తాగినవారికి ఆస్తమా, ఒబెసిటీ, చెవి, శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్లు అయిన డయేరియా వంటి వ్యాధులు రాకుండా ఉంటాయట.