Winter Skin Care Home Remedies:చలికాలం రకరకాల చర్మ సమస్యలను వస్తుంటాయి. ఫలితంగా చర్మం పొడిబారిపోయి నిర్జీవంగా మారి ముఖమంతా కాంతివిహీనంగా తయారవుతుంది. దీంతో చలి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు రకరకాల మాయిశ్చరైజర్లు, కోల్డ్ క్రీములు పెడుతుంటారు. ఇవే కాకుండా ఇంట్లోనే లభ్యమయ్యే పదార్థాలతో మంచి చర్మ ఔషధాన్ని తయారు చేసుకోవచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవీ చెబుతున్నారు. మరి ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఇందుకోసం కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 20 గ్రాముల కచ్చురాల చూర్ణం
- 20 గ్రాముల వట్టివేర్లు చూర్ణం
- ఒక చెంచా చందనం చూర్ణం
- 20 గ్రాముల గులాబి రేకుల పొడి
- 100 గ్రాముల పెసరపిండి
- నువ్వుల నూనె
- మల్లెపూలు
తయారీ విధానం
- ముందుగా ఓ గిన్నెలో కచ్చురాలు, వట్టివేర్లు, చందనం చూర్ణం, గులాబీ రేకుల పొడి, పెసరపిండి వేసి బాగా కలపాలి.
- ఆ తర్వాత ఇందులోనే మల్లెపూలను తుంచి వేసి అన్ని బాగా కలిపేసుకోవాలి.
- స్నానం చేయడానికి ముందు నువ్వుల నూనెను శరీరం అంతా రాసుకోవాలి. సుమారు అరగంట తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఔషధాన్ని ఒళ్లంతా సున్నిపిండిలా రుద్దుకోవాలని చెబుతున్నారు.
- ఇలా చలికాలంలో ప్రతిరోజూ వాడుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందని గాయత్రీ దేవీ చెబుతున్నారు. ఇంకా ఇతర చర్మ సమస్యలు కూడా తగ్గుతాయని వివరిస్తున్నారు. చర్మం మృదువుగా, సున్నితంగా ఉండేందుకు కూడా మంచి ఔషధంలా ఉపయోగపడుతుందని అంటున్నారు.
కచ్చురాలు: చర్మం ఆరోగ్యంగా ఉండడానికి కచ్చురాలు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా చర్మంలో ఉండాల్సిన తేమ, నూనె పదార్థం సరిగ్గా ఉండేలా చేస్తుందని అంటున్నారు.
వట్టివేర్లు: ఇవి చర్మానికి మంచి రంగు ఇస్తాయని గాయత్రీ దేవీ చెబుతున్నారు. టానిక్‌లాగా ఉపయోగపడుతూ తేమ, తడి సరిగ్గా ఉండేలా తోడ్పడతాయని వివరించారు.