Factory Blast At Maharashtra : మహారాష్ట్ర భండారా జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి 8 మంది మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోని ఎల్‌టీపీ సెక్షన్లో పేలుడు జరిగిందని జిల్లా కలెక్టర్ సంజయ్ కోల్తే వెల్లడించారు. మృతులను చంద్రశేఖర్ గోస్వామి (59), మనోజ్ మేష్రామ్ (55), అజయ్ నాగదేవ్ (51), అంకిత్ బరాయ్ (20), లక్షం కెల్వాడే (38), అభిషేక్ చౌరాసియా (35), ధర్మ రంగరి (35), సంజయ్ కరేమోర్‌గా గుర్తించారు.
ఎల్‌టీపీ విభాగంలో పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోయింది. ఘటన జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక విభాగం సిబ్బంది ఎంతో శ్రమించారు. వారికి పోలీసులు, స్థానిక విపత్తు నిర్వహణ విభాగం బృందాలు సహాయం చేశాయి.
VIDEO | Maharashtra: One person was killed in a blast at the ordnance factory in #Bhandara district. Search and rescue efforts are underway for 10 employees, police said.
— Press Trust of India (@PTI_News) January 24, 2025
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/lvqyayeWDp
ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, మృతుల సంఖ్యపై కాసేపటి తర్వాత అధికారిక ప్రకటన చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. "భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 8 మంది మరణించారు. ఏడుగురు గాయపడ్డారు" అని నాగ్‌పుర్‌లో వెల్లడించారు. పేలుడు కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతూ ఒక నిమిషం మౌనం పాటించారు.
ఈ ఘటన చాలా బాధించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌సింగ్ అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అన్ని సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ బాధాకరమైన సమయంలో మృతుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఓ ప్రకటనలో తెలిపింది. ఓ విచారణ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. మరోవైపు, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం.
ఇదిలా ఉండగా, ఈ ప్రమాదం మోదీ ప్రభుత్వం వైఫల్యం వల్లే జరిగిందంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ఆరోపించారు.
Mumbai | On blast in Ordnance Factory, Bhandara, Maharashtra Congress chief Nana Patole says, " this is the failure of the modi government." pic.twitter.com/udmHTLCfWg
— ANI (@ANI) January 24, 2025