MG Comet EV Blackstorm Edition: JSW MG మోటార్ ఇండియా భారతదేశంలో విక్రయించే అత్యంత సరసమైన కారు 'MG కామెట్ EV'. ఇది మంచి ప్రజాదరణను పొంది సేల్స్‌లో దూసుకుపోతోంది. దీంతో ఇప్పుడు కంపెనీ 'MG కామెట్ EV బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్'ను లాంఛ్ చేసింది. ఈ కామెట్ EV బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌ను దాని టాప్-స్పెక్ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ఆధారంగా రూపొందించారు. ఇది ఎరుపు రంగు యాక్సెంట్స్‌తో వీల్ కవర్స్, ఫ్రంట్ స్కిడ్ ప్లేట్, బ్యాడ్జింగ్‌తో ఎంట్రీ ఇచ్చింది.
ఈ బ్రాండ్ ఇప్పటికే దాని హెక్టర్, గ్లోస్టర్, ఆస్టర్ మోడల్స్‌కు సంబంధించిన బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌ను మార్కెట్లో విక్రయిస్తోంది. దీంతో MG కామెట్ EV.. MG గ్లోస్టర్, MG ఆస్టర్, MG హెక్టర్ తర్వాత బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ క్లబ్‌లో చేరిన MG ఇండియా లైనప్‌లో నాల్గవ కారు. అయితే కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో బ్లాక్‌స్టార్మ్ స్పెషల్ ఎడిషన్‌ను అందించడం ఇదే మొదటిసారి.
బుకింగ్స్: కంపెనీ ఈ 'MG కామెట్ EV బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్' బుకింగ్స్‌ను ప్రారంభించింది. కస్టమర్లు రూ. 11,000 టోకెన్ అమౌంట్‌ను చెల్లించి దీన్ని బుక్‌చేసుకోవచ్చు.
ఇంటీరియర్: ఈ కామెట్ EV బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ ఇంటీరియర్ విషయానికి వస్తే ఇది ఆల్-బ్లాక్ సీట్ అప్హోల్స్టరీతో పూర్తిగా రెడ్ కలర్ స్టిచింగ్, ఫ్రంట్ హెడ్‌రెస్ట్‌లపై 'బ్లాక్‌స్టార్మ్' బ్యాడ్జ్‌లతో వస్తుంది. అంటే ఇది రెడ్ కలర్ స్టిచింగ్, ఎరుపు రంగు యాక్సెంట్స్‌తో పాటు ఆల్-బ్లాక్ థీమ్ ఫినిషింగ్‌తో ఎంట్రీ ఇచ్చింది. దీని డాష్ బోర్డ్ ఇప్పటికీ వైట్ అండ్ గ్రే కలర్ థీమ్‌లో వస్తుంది. అయితే మొత్తం క్యాబిన్ లేఅవుట్ సాధారణ కామెట్ లాగానే ఉంది.
ఎక్స్‌టీరియర్: ఈ కామెట్ EV బ్లాక్‌స్టార్మ్ స్టార్రి బ్లాక్ ఎక్స్‌టీరియర్ షేడ్‌తో వస్తుంది. ఇది బంపర్‌పై రెడ్ యాక్సెంట్స్, స్కిడ్ ప్లేట్, సైడ్ క్లాడింగ్, హుడ్‌పై 'మోరిస్ గ్యారేజెస్' బ్యాడ్జింగ్‌తో పాటు స్టార్రీ బ్లాక్ ఎక్స్‌టీరియర్ షేడ్‌ను కలిగి ఉంది. స్టీల్ వీల్స్‌పై ఎర్రటి నక్షత్రం లాంటి ప్యాటర్న్‌తో పూర్తిగా నల్లటి కవర్లు కనిపిస్తాయి. కామెట్ EV ప్రత్యేక ఎడిషన్‌గా దీనిని ప్రత్యేకంగా నిలబెట్టేందుకు కంపెనీ దీని ఫెండర్ పై 'బ్లాక్ స్టార్మ్' బ్యాడ్జ్‌ను కూడా అందించింది.
రియర్ డిజైన్: దీని వెనక డిజైన్ గురించి మాట్లాడుకుంటే MG కామెట్ బ్లాక్‌స్టార్మ్.. కామెట్ బ్యాడ్జింగ్‌తో సహా కొన్ని ఎరుపు రంగు ఎలిమెంట్‌లను, వెనక బంపర్‌పై కొన్ని సిమిలర్ కలర్ యాక్సెంట్స్‌ను కలిగి ఉంది.
నో మెకానికల్ ఛేంజెస్: MG కామెట్ EV బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌లో యాంత్రికంగా ఎలాంటి మార్పులు లేవు. ఇది అదే 17.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ బ్యాటరీ 42 PS, 110 Nm టార్క్ ఉత్పత్తి చేసే రియర్-ఆక్సిల్ మౌంటెడ్ (RWD) ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. దీని ARAI- క్లెయిమ్డ్ రేంజ్ 230 కిలోమీటర్లు.
ఫీచర్స్ అండ్ సేఫ్టీ: ఈ కామెట్ EV ఆల్-బ్లాక్ ఎడిషన్ ఫీచర్ల జాబితాలో ఎటువంటి మార్పులు చేయలేదు. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25-అంగుళాల డ్రైవర్ డిస్ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో పాటు సాధారణ కామెట్లో ఉండే మాన్యువల్ AC వంటి ఫీచర్లు ఇందులోనూ ఉన్నాయి. వీటితో పాటు ఇందులో 4-స్పీకర్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంది.
ఇక దీని భద్రతా సూట్ కూడా సాధారణ కామెట్ మాదిరిగానే ఉంది. రెండు ఎయిర్‌బ్యాగ్‌లు (స్టాండర్డ్‌గా), EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), సెన్సార్‌లతో రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ధర: MG కామెట్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ సాధారణ మోడల్ కంటే కొంచెం ప్రీమియంగా ఎంట్రీ ఇచ్చింది. దీంతో దీని ధర రూ. 7 లక్షల నుంచి రూ. 9.84 లక్షల వరకు ఉంటుంది. అయితే మీరు కామెట్‌తో MG అందించే బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఎంచుకుంటే ధరలు మరింత తగ్గుతాయి. అప్పుడు ధరలు రూ. 5 లక్షల నుంచి రూ. 7.80 లక్షల మధ్య ఉంటాయి. అయితే ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో మీరు బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ఖర్చుగా MG మోటార్ కంపెనీకి కిలోమీటరుకు రూ. 2.5 చెల్లించాల్సి ఉంటుంది.
మార్కెట్లో పోటీ: MG కామెట్ EVకి భారతదేశంలో ప్రత్యక్ష ప్రత్యర్థి లేదు. కానీ దీన్ని టాటా టియాగో EV, సిట్రోయెన్ eC3 లకు సరసమైన ప్రత్యామ్నాయంగా పరిగణించొచ్చు.
హువావేకు ధీటుగా శాంసంగ్ గెలాక్సీ G ఫోల్డ్!- రిలీజ్ ఎప్పుడో తెలుసా?
పవర్ఫుల్ ప్రాసెసర్, 6,000mAh బ్యాటరీతో రియల్మీ కొత్త ఫోన్- రూ. 15,600లకే!
మీ ఫోన్లో డ్యూయల్ సిమ్ ఉందా?- కేవలం రూ.59కే రెండో సిమ్ యాక్టివ్‌గా!