Man Without Chappal In 24 Years : తాను అభిమానించే పార్టీ ఎన్నికల్లో గెలుపొందే వరకు చెప్పులు ధరించబోనని ప్రతిజ్ఞ పూనాడు ఓ వ్యక్తి. అతడి కోరిక 24 ఏళ్ల తర్వాత తీరింది. దీంతో 60 ఏళ్ల వృద్ధుడు మళ్లీ చెప్పులు వేసుకున్నాడు.
అసలేం జరిగిందంటే?
అసోం నాగౌవ్ జిల్లాలోని సమగురికి చెందిన అతుల్ దేబ్‌నాథ్(60) అసోం గణపరిషత్(ఏజీపీ) పార్టీ కార్యకర్త. అలాగే వీరాభిమాని కూడా. ఆయనది సమగురి నియోజకవర్గం. అయితే 2001లో జరిగిన శాససనభ ఎన్నికల్లో అసోం గణపరిషత్ అభ్యర్థి అతుల్ శర్మను కాంగ్రెస్ నేత రకీబుల్ హుస్సేన్ ఓడించారు. దీంతో దేబ్‌నాథ్ తీవ్ర వేదనకు గురయ్యాడు. సమగురి నియోజకవర్గంలో అసోం గణపరిషత్ గెలిచినంత వరకు చెప్పులు ధరించబోనని ప్రతిజ్ఞ చేశాడు.
బీజేపీ విజయఢంకా
గతేడాది అక్టోబర్లో సమగురి స్థానానికి ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో అధికార బీజేపీ అభ్యర్థి దిప్లు రంజన్ శర్మ సమగురిలో 24 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు తెరదించారు. కాంగ్రెస్ అభ్యర్థి తంజిల్ హుస్సేన్ పై 24,423 ఓట్ల తేడాతో గెలుపొందారు. తంజిల్ హుస్సేన్ ఎవరో కాదు గతంలో అసోం గణపరిషత్ అభ్యర్థి అతుల్ శర్మను ఓడించిన రకీబుల్ హుస్సేన్ కుమారుడే. ముస్లింలు ఎక్కువగా ఉండే సమగురి నియోజకవర్గంలో బీజేపీ విజయం చారిత్రకంగా నిలిచిపోయింది. కాగా, కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామి పార్టీగా అసోం గణపరిషత్ ఉంది.
24 ఏళ్ల తర్వాత చెప్పులు ధరించిన కార్యకర్త
సమగురిలో 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని అసోం గణపరిషత్ భాగస్వామి పార్టీ అయిన బీజేపీ ఓడించడం వల్ల దేబ్‌నాథ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఏజీపీ సీనియర్ నేత, మంత్రి కేశబ్ మహంత జనవరి 22న దేబ్‌నాథ్ ఇంటికి వెళ్లారు. ఆయనకు చెప్పులను కానుకగా అందించారు. 24ఏళ్ల నిరీక్షణ తర్వాత దేబ్‌నాథ్ తన ప్రతిజ్ఞ నెరవేరడం వల్ల కొత్త పాదరక్షలను ధరించారు.
"2001 నుంచి సమగురిలో కాంగ్రెస్ పాలన మాకు ఒక పీడకలలా మారింది. స్థానిక కాంగ్రెస్ నాయకులు మా కుటుంబాన్ని అవమానించేవారు. అలాగే ఎగతాళి చేసేవారు. కొందరు కాంగ్రెస్ నేతలు నన్ను హింసించారు. ఈ 24 ఏళ్లలో ఇంటి నుంచి ఎక్కడికి వెళ్లినా చెప్పుల లేకుండా నడిచాను. నన్ను చాలా మంది కాంగ్రెస్ నేతలు ఎగతాళి చేశారు. అయితే వారి ఎగతాళి, అవమానం, హింస నా ధైర్యాన్ని మరింత పెంచాయి." అని దేబ్‌నాథ్ చెప్పుకొచ్చారు.