Director Shyam Benegal Died : ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ (90) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన, ముంబయిలోని ఓ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబీకులు ధ్రువీకరించారు. కాగా, 1934లో అప్పటి హైదరాబాద్ సంస్థానంలో శ్యామ్ బెనగల్ జన్మించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, ఏఎన్‌ఆర్ జాతీయ అవార్డులు అందుకున్నారు.
శ్యామ్ బెనెగల్ మృతిపై యావత్ సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. దేశంలోని అత్యుత్తమ దర్శకులు, గొప్ప మేధావుల్లో బెనెగల్ ఒకరని చిరంజీవి పేర్కొన్నారు. చలనచిత్ర రంగంలో వెలుగొందిన కొంతమంది ప్రముఖుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారన్న చిరంజీవి.. ఆయన సినిమాలు, జీవిత చరిత్రలు, డాక్యుమెంటరీలు భారత గొప్ప సాంస్కృతిక సంపదలో భాగమన్నారు. తోటి హైదరాబాదీ, మాజీ రాజ్యసభ సభ్యుడైన బెనెగల్ అద్భుతమైన సినిమాలు తీశారని.. అవి భారతీయ చలనచిత్ర రంగంలో ఎల్లప్పుడూ గౌరవాన్ని పొందుతాయని చెప్పారు.
- 90వ పుట్టినరోజు సందర్భంగా బెనెగల్ నటీనటులతో కలిసి దిగిన ఫొటోను షబానా అజ్మీ షేర్ చేశారు.
- 'శ్యామ్ బెనెగల్ ఇక లేరనే విషయం ఎంతో బాధిస్తోంది. దేశంలో అత్యున్నత సినీ దర్శకుల్లో ఆయన ఒకరు. నిజంగా ఆయనో లెజెండ్' - అక్షయ్ కుమార్
- 'సినిమా రంగంలో సరికొత్త వేవ్ సృష్టించారు. అంకుర్, మంథన్ వంటి అనేక అద్భుత సినిమాలతో, భారతీయ సినిమా మార్గాన్ని మార్చిన వ్యక్తిగా ఎన్నటికీ గుర్తుంటారు. షబానా అజ్మీ, స్మితా పాటిల్ వంటి ఎంతో మంది అత్యుత్తమ నటులను తీర్చిదిద్దారు' - శేఖర్ కపూర్
- 'భారతీయ సినిమా దిగ్గజాల్లో ఒకరుగా నిలిచిన శ్యామ్ బెనెగల్‌కు సంతాపం తెలియజేస్తున్నా. నాతో పాటు నా సోదరీమణులకు ఆయన చిన్నప్పటి నుంచి సుపరిచితం. ఆయన మరణం సినీ ప్రపంచానికి, మానవాళికి తీరని లోటు' - శశిథరూర్
బెనగల్ సినిమా అంటే అవార్డ్ పక్కా!