How to Make Corn Pulao at Home: పులావ్.. చాలా మంది ఫేవరెట్ డిష్. అందుకే వీలు కుదిరినప్పుడల్లా రకరకాలుగా చేసుకుంటుంటారు. కూరగాయలతోపాటు మటన్, చికెన్, ఫిష్ లాంటి నాన్ వెజ్లతోనూ పులావ్ చేసుకుంటుంటారు. అయితే ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఈసారికి వెరైటీగా మొక్కజొన్న పులావ్ చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది. సాధారణంగా మొక్కజొన్న పొత్తులను నిప్పుల మీద కాల్చుకునో, నీళ్లలో ఉడకబెట్టుకునో తింటుంటారు. అయితే అలానే కాకుండా కొంచెం వెరైటీగా ఈ పులావ్ చేయండి. లంచ్ బాక్స్‌లకు కూడా ఇది పర్ఫెక్ట్ రెసిపీ. మరి, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు:
- బాస్మతి బియ్యం-గ్లాసు
- స్వీట్‌కార్న్-కప్పు
- నెయ్యి -టేబుల్‌స్పూన్
- నూనె-టేబుల్‌స్పూన్
- జీలకర్ర- అర టీ స్పూన్
- బిర్యానీ ఆకులు-రెండు
- యాలకులు-మూడు
- దాల్చిన చెక్క- చిన్న ముక్క
- లవంగాలు-ఆరు
- మిరియాలు - నాలుగు
- సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి-రెండు
- పొడవుగా కోసిన ఉల్లిపాయ-ఒకటి
- ఉప్పు-సరిపడా
- అల్లంవెల్లుల్లి పేస్టు-టీ స్పూన్
- చిన్నగా కట్ చేసిన క్యారెట్, బంగాళాదుంప, టమాట ముక్కలు-కప్పు
- గరంమసాలా-పావు టీ స్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- నిమ్మరసం-అరచెక్క
తయారీ విధానం:
- ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి పావుగంట నానబెట్టాలి.
- స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో నూనె, నెయ్యి వేసి వేడిచేసుకోవాలి.
- నూనె కాగిన తర్వాత మసాలా దినుసులు(జీలకర్ర, బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, మిరియాలు) ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి.
- తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయే వరకూ ఫ్రై చేసుకోవాలి.
- అనంతరం క్యారెట్, బంగాళాదుంప, టమాట ముక్కలు, స్వీట్‌కార్న్, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి కాసేపు ఉడికించాలి.
- ఆ తర్వాత కడిగిన బియ్యం, గరం మసాలా వేసి బాగా కలుపుతూ వేయించాలి. ఇప్పుడు గ్లాసున్నర నీళ్లు పోసి.. కొద్దిగా కొత్తిమీర తురుము వేసి, అరచెక్క నిమ్మరసం వేసి కలపాలి. దీనివల్ల పులావ్ పొడి పొడిగా వస్తుంది.
- ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని ఒకసారి కలిపి మూత పెట్టి సిమ్‌లో రెండు విజిల్ రాగానే స్టౌఆఫ్ చేయాలి.
- ఆవిరి మొత్తం పోయినా తర్వాత మూత తీసేస్తే పులావ్‌లోని నీరంతా ఇంకిపోయి పొడిపొడిగా ఉంటూ ఘుమఘుమలాడుతుంది. అంతే దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుని ఏదైనా రైతాతో తింటే సూపర్ టేస్ట్.
- నచ్చితే మీరూ ఈ రెసిపీ ట్రై చేయండి. పిల్లల లంచ్బాక్స్లకు కూడా ఇది పర్ఫెక్ట్.