Full Rush in MGBS, JBS Hyderabad : సంక్రాంతి పండుగ నేపథ్యంలో రద్దీతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. పండుక్కి సొంతూరు వెళ్లేందుకు జనం పోటెత్తడంతో ప్రయాణ ప్రాంగణాలు కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి పల్లెలకు ప్రజలు భారీగా కదలివెళ్తున్నారు. సికింద్రాబాద్, జేబీఎస్, ఎంజీబీఎస్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌లోని బస్టాండ్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. పండుగపూట స్వగ్రామాలకు వెళ్దామంటే చాలీచాలని బస్సులు, రైళ్లలో సీట్లు దొరక్క అవస్థలు తప్పడం లేదని జనం వాపోయారు.
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో హైదరాబాద్‌లోని ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ తోపాటు కూకట్‌పల్లి, ఆరాంఘర్, దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్, ఎల్బీనగర్ కూడలి, వనస్థలిపురం, హయత్‌నగర్ వద్ద వాహనాల రద్దీ నెలకొంది. ప్రధానంగా ఏపీకి వెళ్లే రోడ్లపై రద్దీ కనిపిస్తుండగా సంక్రాంతి పండగ కోసం దాదాపు 6 వేల 432 బస్సులను నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. వాహనాలు భారీగా తరలివెళ్లడంతో నగరం దాటేందుకు గంటల కొద్దీ సమయం పట్టింది.
గంటలకొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి : రాష్ట్రంలో రెండో ప్రధాననగరం వరంగల్‌లోనూ రద్దీ నెలకొంది పండగరద్దీతో హనుమకొండ బస్టాండ్ జనంసంద్రంగా మారింది. ఏకశిలా నగరం నుంచి సమీపంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు సరిపడా బస్సులు లేక గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. రద్దీకి సరిపడా బస్సులు నడపకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వాపోయారు .
రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. జనంరద్దీదృష్ట్యా రైల్వేశాఖ పలుప్రాంతాలకి ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. హైదరాబాద్ మెట్రో రైళ్లలోనూ రద్దీ కొనసాగుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎల్బీనగర్, మియాపూర్, సికింద్రాబాద్, ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర ప్రాంతాలకు చేరుకునేందుకు ప్రజలు మెట్రో రైళ్లలో ప్రయాణించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర వెళ్లే వారు ఎక్కువ మంది రైళ్లలో సీట్లు దొరక్క అవస్థలు పడ్డారు. ప్రత్యేక రైళ్లలో అన్‌రిజర్వుడ్ సీట్లు ఎక్కువగా ఉంటే ఉపయోకరమని చెబుతున్నారు. ప్రత్యేక సర్వీసుల్లోనూ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.
కిక్కిరిసిన హైదరాబాద్ - విజయవాడ హైవే - ఎల్బీనగర్ వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? - ఈ రూట్లలో వెళితే ఆగకుండా సాగిపోవచ్చు!