Weekly Horoscope From January 26th To February 1st 2025 : జనవరి 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?
మేషం (Aries) :మేషరాశి వారికి ఈ వారం సానుకూలంగా, విజయవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు, నిరుద్యోగులు గొప్ప అవకాశాలను అందుకుంటారు. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు. అన్ని రంగాల వారికి కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి రావడం వల్ల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగు పడుతుంది. కుటుంబంలో సుఖ శాంతులు వెల్లి విరుస్తాయి. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. గృహంలో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. నూతన వస్తువాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మీ ప్రియమైన వారి నుంచి బహుమతులు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు ప్రణాళిక వేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ వారం అదృష్టదాయకంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున వృత్తి వ్యాపార నిపుణులు, ఉద్యోగులు లక్ష్యసాధనకు ప్రాధాన్యతనిచ్చి తమ తమ రంగాలలో గొప్ప విజయాలను సొంతం చేసుకుంటారు. ఆర్థిక పరంగా అనేక శుభ ఫలితాలను ఈ రాశి వారు ఈ వారం పొందుతారు. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెడితే విపరీతమైన లాభాలుంటాయి. నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగ ప్రాప్తి ఉంది. న్యాయపరమైన విషయాలలో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. విదేశాలలో ఉద్యోగం చేయాలని కలలు కనేవారు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. మతపరమైన, సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో మీ హోదా, గౌరవం పెరుగుతాయి. గృహంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీగణపతి ఆలయ సందర్శన శుభప్రదం.
మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో గత కొంతకాలంగా ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. వారం ప్రధమ భాగం అదృష్టదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులు ఉన్నతాధికారుల మద్దతు, సహోద్యోగుల సహకారాన్ని అందుకుంటారు. వృత్తి పరంగా ఎదగడానికి నైపుణ్యాలను పెంచుకోవడం, తీవ్రమైన కృషి అవసరం. వ్యాపార పరంగా చేసే పర్యటనలు అనుకూలిస్తాయి. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు లాభదాయకంగా ఉంటాయి. వారం ద్వితీయార్ధంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరినీ సంప్రదించడం అవసరం. జీవిత భాగస్వామితో కలహాలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులు వారం ప్రారంభంలో ఉద్యోగంలో గణనీయమైన విజయాన్ని పొందే అవకాశం ఉంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ అందుతుంది. కోరుకున్న చోటికి బదిలీ కూడా కావడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపారులు అద్భుతంగా రాణిస్తారు. వ్యాపార ప్రయోజనాల నిమిత్తం దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టేముందు భాగస్వాములను సంప్రదించడం అవసరం. వృత్తి పరంగా ఎదగడానికి స్నేహితుల ప్రోద్భలం, ప్రోత్సాహం ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. సామాజిక మాధ్యమాల విషయంలో అప్రమత్తంగా ఉండడం అవసరం. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన సత్ఫలితాలనిస్తుంది.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం మంచి అదృష్టం, మెరుగైన ప్రయోజనాలు అందుకుంటారు. స్నేహితుల సహాయంతో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు, కోరుకున్న చోటికి బదిలీ ఉండవచ్చు. మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఎన్నో రోజుల నుంచి వేధిస్తున్న కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి భుజంగ స్తోత్ర పారాయణ శుభప్రదం.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించవలసి ఉంటుంది. వ్యాపారస్తులు ఆశించిన లాభాలను పొందుతారు. వ్యాపారాన్ని విస్తరించడంలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉపాధి లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పదోన్నతులు రావడం వల్ల నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్నదమ్ముల మధ్య కొనసాగుతున్న విభేదాలు ముగుస్తాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి.
తుల (Libra) : తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో ఏర్పడిన సన్నిహిత సంబంధాలు మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు తీసుకువస్తాయి. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు సన్నిహితుల సహకారంతో పెండింగ్ పనులను పూర్తి కావడం వల్ల సంతోషంగా ఉంటారు. కెరీర్, వ్యాపారంలో కొత్త అవకాశాలను అందుకుంటారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు మరి కొంతకాలం వేచి చూస్తే మంచిది. భూమి, ఆస్తి లావాదేవీల నుంచి గణనీయమైన ఆర్థిక లాభాలు పొందుతారు. మీ భాగస్వామి మద్దతుతో కుటుంబ సమస్యలు పరిష్కరిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉండవచ్చు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. సంతానం పురోగతి పట్ల సంతృప్తితో ఉంటారు. హనుమాన్ చాలీసా పారాయణ శుభకరం.
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులు లక్ష్య సాధన కోసం తీవ్రంగా కృషి చేస్తే విజయం ఉంటుంది. ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించడం అవసరం. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. సన్నిహితుల నుంచి విలువైన కానుకలు అందుకుంటారు. ఆర్థిక విషయాల పట్ల తెలివిగా వ్యవహరించాలి. షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. కుటుంబ సభ్యుల మాటలకు విలువ ఇవ్వడం మంచిది. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. గణపతి ఆరాధన శుభప్రదం.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగులు, వృత్తి నిపుణులు కెరీర్లో దూసుకెళ్తారు. మీ పనితీరు పట్ల ఉన్నతాధికారులు సంతృప్తి చెందుతారు. వృత్తి పరమైన మీ నైపుణ్యంతో మెరుగైన అవకాశాలు అందుకుంటారు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. వ్యాపారం ఎదురయ్యే సవాళ్లు, పోటీ అధిగమించడానికి కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. కెరీర్ లో పురోగతికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మద్దతుతో నూతన ఆదాయ మార్గాల ద్వారా సంపద వృద్ధి చెందుతుంది. ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం. విద్యార్థులు తీవ్రమైన కృషితోనే విజయాలు సాధిస్తారు. అనారోగ్య సమస్యలు తగ్గు ముఖం పడతాయి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సమయపాలన, క్రమశిక్షణ అవసరం. నష్టాలు కలిగించే పనులకు దూరంగా ఉండండి. మీ అభిప్రాయాలను అందరితో చర్చించడం ద్వారా సమిష్టి విజయాన్ని సాధించవచ్చు. ఉద్యోగ బాధ్యతలు విస్మరించవద్దు. సమయానుకూలంగా వ్యవహరించడం ద్వారా ఉన్నతాధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. అదనపు ఆదాయ మార్గాల ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు. ఆర్థిక వ్యవహారాలను, ఖర్చులను తెలివిగా నిర్వహించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. దుర్గాస్తుతి పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగులు తీవ్రమైన కృషితో పదోన్నతులు పొందుతారు. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులు భాగస్వాముల సహకారంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపారంలో ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వద్దు. అనుకోని ఖర్చులు కారణంగా ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాన్ని పొందడానికి మరికొంతకాలం వేచి చూడాలి. జీవిత భాగస్వామితో విభేదాలు వివాదాలకు దారితీయకుండా చూసుకోండి. కుటుంబ సమస్యలు పరిష్కారానికి చొరవ చూపించండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ వారం విజయవంతంగా ఉంటుంది. అన్ని రంగాలవారికి శుభసమయం నడుస్తోంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి, ఆర్థిక వృద్ధి ఉంటాయి. అదృష్టం వరించి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుంది. వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమిస్తే విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగులు స్వబుద్ధితో, సొంత నిర్ణయాలతో పనిచేస్తే శుభఫలితాలు ఉంటాయి. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు పెంచుకుంటే మంచిది. జీతం పెరుగుదల ద్వారా అదనపు ఆదాయానికి అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు ఆశించిన ఆర్థిక లాభాలు ఉంటాయి. ప్రేమికులు వివాహ బంధంతో ఒక్కటవుతారు. స్థిరాస్తి రంగం వారు శుభ ఫలితాలను అందుకుంటారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. శివాలయం దర్శనం శుభకరం.