Fire Breaks Out in Two Boats in Hussain Sagar : హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో రెండు పడవల్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పీపుల్స్ ప్లాజా వేదికగా భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాతకు మహా హారతి పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు హాజరయ్యారు. కార్యక్రమం ముగింపు వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు హుస్సేన్‌సాగర్‌లో బాణాసంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక పడవలో పెద్ద ఎత్తున బాణాసంచాతో పేల్చేందుకు ఐదుగురు సహాయకులు అందులోకి ఎక్కారు.
బాణాసంచా పేలి పెద్ద ఎత్తున మంటలు : ఆ పడవను మరో బోటుకి కట్టి సాగర్‌కు కొద్దిదూరం తీసుకెళ్లి బాణాసంచా పేల్చడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో రాకెట్ పేల్చి పైకి విసిరే క్రమంలో బోటు దగ్గరే పేలి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. అవి బోటులోని బాణాసంచాపై పడటంతో మంటలంటుకున్నాయి. క్షణాల్లో బాణాసంచా పేలి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. బోటులోని ఐదుగురు నీళ్లలోకి దూకారు. బాణా సంచా కాలుస్తున్న గణపతి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా, అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గణపతి శరీరానికి 100 శాతం కాలిన గాయాలై స్పృహ తప్పిపోవడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన మరో నలుగురు వ్యక్తులు : చింతలకృష్ణ, సాయిచంద్‌కు స్వల్పంగా కాలిన గాయాలు కాగా, సీతాఫల్‌మండికి చెందిన సునీల్, ప్రణీత్ స్వల్వ గాయాలతో బయటపడ్డారు. వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనలో బాణాసంచా ఉన్న పడవతో పాటు దానితో పాటు ఉన్న మరో పడవ పూర్తిగా కాలిపోయాయి. రెండు అగ్నిమాపక శకటాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బోట్లు నీటిలో కొద్దిదూరం ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది అప్పటికప్పుడు ప్రత్యేకంగా తెప్పించిన రెండు బోట్లతో మంటలు ఆర్పే యత్నం చేశాయి. మంటలు ఆర్పడానికి దాదాపు రెండున్నర గంటలకు పైగా శ్రమించాల్సి వచ్చింది. అయితే ప్రమాదం జరగడానికి కొద్ది సేపు ముందే కిషన్‌రెడ్డి, గవర్నర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. హుస్సేన్ సాగర్ జలాల్లో భారీ అగ్నిప్రమాదంలో తృటిలో పెనుముప్పు తప్పటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కొండాపూర్‌లోని మహీంద్ర షోరూంలో అగ్నిప్రమాదం - 14 కార్లు దహనం
మాదాపూర్‌లోని రెస్టారెంట్లో మంటలు - పరుగులు తీసిన కస్టమర్లు