Woman Dies in Road Accident Same As Her Husband : 20 సంవత్సరాల కిందట భర్త, ఇప్పుడు భార్య అదే రోడ్డులో ఇంచుమించు 10 అడుగుల పరిధిలోనే రోడ్డు ప్రమాదాల్లో దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్కతుర్తి మండలానికి చెందిన జంగం స్వరూప (54) ఆదివారం వేకువజామున 5.40 గంటల సమయంలో సిద్దిపేట జిల్లా అక్కనపేట్ మండలంలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
బస్సులో వెళ్దామని బస్టాండుకు నడుచుకుంటూ వెళ్తుండగా ఇల్లు దాటి 30 అడుగులు వేసిందో లేదో హనుమకొండ నుంచి హుజూరాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఆమెను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త ఐలయ్య కూడా 20 ఏళ్ల కిందట బయటకు వస్తుండగా ఇళ్లు దాటి 25 అడుగులు వేశారో లేదో వాహనం ఢీకొని దుర్మరణం చెందారు. ఇప్పుడు స్వరూప సైతం అదే రోడ్డులో, దాదాపు అదే ప్రాంతంలో యాక్సిడెంట్లో చనిపోవడంతో బాధిత కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. అక్కడ రోడ్డు మలుపు ఉండటంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. మృతురాలి కుమారుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
లారీ బోల్తాపడి ఐదుగురు వలస కూలీల దుర్మరణం - దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్