Tomato Onion Chutney Recipe : మనలో చాలా మందికి రోటి పచ్చళ్లంటే ఎంతో ఇష్టపడతారు. ఇంట్లో ఏ కూరగాయలూ లేనప్పుడు ఏదైనా కమ్మటి రోటి పచ్చడి ఉంటే చాలు, ఆ పూట తృప్తిగా భోజనం చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ క్రమంలోనే ఎక్కువ మంది ప్రిపేర్ చేసుకునే వాటిలో టమాటా పచ్చడి ముందు వరుసలో ఉంటుంది. అయితే, ఎప్పుడూ ఒకే స్టైల్లో కాకుండా ఈసారి సరికొత్తగా ట్రై చేయండి. అదే, "టమాటా ఉల్లిపాయ రోటి పచ్చడి".
వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అమోఘం అని చెప్పాల్సిందే. కేవలం అన్నంలోకే కాదు చపాతీ, ఇడ్లీ, దోశ, వడ ఇలా ఏ టిఫెన్లోకైనా అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి. పైగా దీనికి తాలింపు కూడా అవసరం లేదు! మరి, ఈ సూపర్ టేస్టీ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- నూనె - 5 స్పూన్లు
- మెంతులు - పావు చెంచా
- ఎండుమిర్చి - 10
- ఆవాలు - ముప్పావు చెంచా
- ఇంగువ - చిటికెడు
- కరివేపాకు - కొద్దిగా
- టమాటాలు - 2(పెద్ద సైజ్వి)
- ఉల్లిపాయలు - 2(పెద్ద సైజ్వి)
- పసుపు - పావుటీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- చింతపండు - కొద్దిగా
"దొండకాయ టమాటా పచ్చడి" - ఈ కాంబో కిర్రాక్ - లొట్టలేసుకుంటూ తినాల్సిందే!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్లో చింతపండుని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. అలాగే, రెసిపీలోకి కావాల్సిన టమాటాలు, ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక మెంతులు వేసుకొని బాగా వేయించుకోవాలి.
- అవి వేగాక అందులో ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు, ఇంగువ కూడా వేసుకొని అన్నింటినీ చక్కగా వేయించుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచాలి.
- అనంతరం అదే పాన్లో మరో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కాక ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పసుపు వేసి కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద మధ్యమధ్యలో కలుపుతూ 8 నుంచి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
- ఆ తర్వాత అందులో తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉప్పు, నానబెట్టిన చింతపండు నుంచి తీసిన రసం యాడ్ చేసుకొని కలిపి మరో 5 నిమిషాల పాటు మిశ్రమాన్ని మగ్గించుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
- ఇప్పుడు శుభ్రంగా కడిగి తుడుచుకున్న రోటిలో ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసుకొని మెత్తగా దంచుకోవాలి.
- ఆ తర్వాత అందులో మగ్గించుకున్న టమాటా ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా నూరుకోవాలి.
- ఆ విధంగా రుబ్బుకున్నాక పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "టమాటా ఉల్లిపాయ రోటి పచ్చడి" రెడీ!
- అయితే రోలు, రోకలి అందుబాటులో లేనివారైతే మిక్సీలో వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ, రోట్లో దంచుకున్నంత టేస్ట్ రాకపోవచ్చు!