Best Days for Hair Cut As Per Astrology : జుట్టు, గడ్డం కాస్త పెరిగినట్టు అనిపించగానే వెంటనే సెలూన్‌కి వెళ్లడం, లేదంటే తామే స్వయంగా చేసుకోవడం చేస్తుంటారు. కానీ, మీకు తెలుసా? జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఎప్పుడు పడితే అప్పుడు హెయిర్ కటింగ్, షేవింగ్ చేసుకోవడం మంచిదికాదట. అలా చేస్తే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందట. మరి, ఇంతకీ హెయిర్ కటింగ్, గడ్డం చేయించుకోవడానికి ఏ రోజులు మంచివి? దీనిపై జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మనలో చాలా మంది వీకెండ్ టైమ్‌లో జుట్టు కత్తిరింపులు, షేవ్ చేసుకోవడం చేస్తుంటారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు ఆదివారం సెలవు దినం కావడంతో సెలూన్‌కు వెళ్తుంటారు. కానీ, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం, శనివారం కటింగ్, గడ్డం చేయించుకోకపోవడమే మంచిదంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు వేణుగోపాల్.
అలాగే, కటింగ్ చేయించుకునేటప్పుడు ముందుగా గడ్డం గీయించుకోవాలట. ఆపైనే హెయిర్ కట్ చేయించుకోవాలంటున్నారు. ఇలా చేయించుకోవడం ద్వారా కుటుంబ వృద్ధి కలుగుతుందని చెబుతున్నారు. అయితే, ఇక్కడ కుటుంబ వృద్ధి అంటే యవ్వనవంతుడిగా ఉంటాడని అర్థమట. అదేవిధంగా సంసార వృద్ధిలో క్షవరానికి కూడా మంచి ప్రాధాన్యత ఉన్నట్లు జ్యోతిష్యశాస్త్రం పేర్కొంటోందట.
ఎప్పుడు చేయించుకోవాలి?
హెయిర్ కటింగ్, షేవింగ్ ఈ మూడు రోజుల్లో చేయించుకోవడం మంచిదట. ఈరోజుల్లో చేయించుకోవడం ద్వారా అదృష్టం వరించడంతోపాటు విశేషమైన ఫలితాలను సొంతం చేసుకోవచ్చంట. వారంలో బుధవారం, గురువారం, సోమవారాల్లో హెయిర్ కట్, గడ్డం చేయించుకోవడం మంచిదని మాచిరాజు చెబుతున్నారు.
ఈ తిథుల్లో కటింగ్, షేవింగ్ వద్దు!
ఇకపోతే హెయిర్ కటింగ్, షేవింగ్ అనేది కొన్ని తిథులలో చేయించుకోవడం మంచిది కాదట. పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి వంటి తిథుల సమయంలో కటింగ్, గడ్డం చేయించుకోవడానికి దూరంగా ఉండడం బెటర్ అంటున్నారు.
అదేవిధంగా గోర్లు, మీసాలు, రోమాలు కత్తిరించుకునే విషయంలోనూ కొన్ని నియమాలు పాటించాలంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు వేణుగోపాల్. ముఖ్యంగా వీటిని ప్రతి ఐదు రోజులకోసారి కత్తిరించుకోవడం మంచిదట. అలాగే, ముక్కులోని వెంట్రుకలను తరచూ కత్తిరించుకోవద్దంటున్నారు. ఎందుకంటే దాని వలన కంటికి ఇబ్బంది కలగవచ్చంటున్నారు. మనం పీల్చే గాలిలో అనేక హానికారక క్రీములు ఉంటాయి. వాటిని పసిగట్టి ఆపి మంచి గాలిని పంపేది ముక్కులోని వెంట్రుకలు. కాబట్టి, అలాంటి వాటిని తరుచుగా కత్తిరించవద్దంటున్నారు. ఒకవేళ బాగా పెరిగితే మాత్రం కత్తిరించుకోవడంలో తప్పు లేదని మాచిరాజు వేణుగోపాల్ చెబుతున్నారు.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇవీ చదవండి :
"చేతిలో పైసా మిగలట్లేదా? - మిరియాలతో శక్తివంతమైన పరిహారం చేస్తే ధన ప్రవాహమే"
"మిమ్మల్ని నరదిష్టి వేధిస్తోందా? - ఈ ఉంగరం ధరిస్తే ఇట్టే తొలగిపోతుంది"