CM Revanth Reddy Video Message On New Govt Schemes : రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గణతంత్ర దినోత్సవం రోజు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల కార్యక్రమాలను ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 4 పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వీడియో సందేశం ఇచ్చారు. ఈ వీడియో సందేశాన్ని గ్రామ సభల్లో అధికారులు ప్రదర్శించారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం కృషి : రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం సందేశాన్ని ప్రదర్శించారు. రైతు భరోసా, నిరుద్యోగ సమస్య పరిష్కారం, వరికి బోనస్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రూ.500కు సిలిండర్ వంటి కార్యక్రమాలతో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు సీఎం తెలిపారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు అదే విధంగా బలహీన వర్గాలు మైనారిటీలు మహిళలు నిరుపేదలందరినీ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రేవంత్ రెడ్డి వీడియో సందేశంలో వివరించారు.
పేదల కళ్లల్లో వెలుగులు చూడాలనే : ఎంతో మంది పేదలు కొన్నేళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం అండగా ఉండాలని రైతుకూలీలు కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డి తన వీడియో సందేశంలో తెలిపారు. రైతు భరోసాలో ఏడాదికి రూ.12 వేలు రైతుల ఖాతాల్లో వేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వగా, పదేళ్ల తర్వాత పేదల కళ్లల్లో వెలుగు చూడటానికి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి వివరించారు. తొలి ఏడాదిలోనే 50 వేల153 ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చి రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగ యువతకు ఆనందాన్ని కలిగించామని తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులను ఆదుకోవడంతో పాటు రాష్ట్ర గీతాన్ని, తెలంగాణ తల్లిని రూపొందించినట్లు వివరించారు. రేవంత్ రెడ్డి వీడియో సందేశాన్ని గ్రామసభల్లో అధికారులు ప్రదర్శించారు.
పేదలంతా ఎక్కడున్నా రేషన్ కార్డు తీసుకోండి - త్వరలోనే సన్నబియ్యం : సీఎం రేవంత్ రెడ్డి