Young Man Missing In Hussin Sagar : హుస్సేన్‌సాగర్‌లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత నాగారం వాసి అజయ్ అదృశ్యమయ్యాడు. ఈ మేరకు సోమవారం ఉదయం హుస్సేన్ సాగర్ వద్దకు కుటుంబ సభ్యులు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాలని పోలీసులను కోరారు. అజయ్‌తో పాటు వెళ్లిన స్నేహితులు సరక్షితంగా ఇంటికి వచ్చారని తెలిపారు. దీంతో పోలీసులు అజయ్ కోసం రెండు రెస్క్యూ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మరికొన్ని బృందాలను రప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నాగారం వాసి అజయ్ అదృశ్యం : హుస్సేన్‌సాగర్‌లో ఆదివారం భరతమాతకు మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. దీన్ని తిలకించేందుకు అజయ్ తన స్నేహితులతో వచ్చాడు. ఒక్కసారిగా బాణాసంచా పేలుస్తుండగా మంటలు అంటుకొని రెండు బోట్లు దగ్ధమయ్యాయి. అప్పటి నుంచి అజయ్ కనిపించడం లేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
గాయపడిన ఐదుగురు వ్యక్తులు : హుస్సేన్‌సాగర్‌లో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో ఐదుగురు నీటిలోకి దూకి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. వీరిలో బాణా సంచా కాలుస్తున్న గణపతి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా, అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గణపతి శరీరానికి 100 శాతం కాలిన గాయాలై స్పృహ తప్పిపోవడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చింతలకృష్ణ, సాయిచంద్‌కు స్వల్పంగా కాలిన గాయాలు కాగా, సీతాఫల్‌మండికి చెందిన సునీల్, ప్రణీత్ స్వల్వ గాయాలతో బయటపడ్డారు. వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనలో బాణాసంచా ఉన్న పడవతో పాటు దానితో పాటు ఉన్న మరో పడవ పూర్తిగా కాలిపోయాయి. రెండు అగ్నిమాపక శకటాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ప్రమాదం ఎలా జరిగింది? : బోట్లు నీటిలో కొద్దిదూరం ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది అప్పటికప్పుడు ప్రత్యేకంగా తెప్పించిన రెండు బోట్లతో మంటలు ఆర్పే యత్నం చేశాయి. మంటలు ఆర్పడానికి దాదాపు రెండున్నర గంటలకు పైగా శ్రమించాల్సి వచ్చింది. అయితే ప్రమాదం జరగడానికి కొద్ది సేపు ముందే కిషన్‌రెడ్డి, గవర్నర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగి ఉంటుందని పోలీసులు ఆరా తీస్తున్నారు.
హుస్సేన్‌సాగర్‌లో 2 బోట్లలో భారీ అగ్నిప్రమాదం - బాణాసంచా పేలుస్తుండగా ఘటన
కొండాపూర్‌లోని మహీంద్ర షోరూంలో అగ్నిప్రమాదం - 14 కార్లు దహనం