Telangana Girl in Khelo India Winter Games : ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారులు మెరిశారు. రాష్ట్రానికి చెందిన నయన శ్రీ తాళ్లూరి, ప్రణవ్ మాధవ్‌లు అద్భుత క్రీడా ప్రతిభను ప్రదర్శించి తెలంగాణ ఖ్యాతిని చాటారు. ఐస్ స్కేటింగ్ విభాగంలో నయనశ్రీ బంగారు పతకాన్ని సాధించి సత్తా చాటింది. మరోవైపు స్పీడ్ స్కేటింగ్ విభాగంలో ప్రణవ్ మాధవ్ బంగారు పతకాన్ని సాధించి తెలంగాణ పేరును విశ్వవ్యాప్తం చేశారు.
ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో నయనశ్రీకి బంగారు పతకం : తెలంగాణకు చెందిన క్రీడాకారిణి నయనశ్రీ తాళ్లూరి ఈ వింటర్ గేమ్స్‌లో పాల్గొని 500 మీటర్ల ఐస్ స్కేటింగ్ విభాగంలో తన అత్యద్భుత క్రీడా ప్రతిభను ప్రదర్శించి బంగారు పతకాన్ని కైసవం చేసుకుని సత్తా చాటారు. ఈ సందర్భంగా నయన శ్రీ మాట్లాడూతూ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ లాంటి ప్రతిష్ఠాత్మక పోటీల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మన భారతీయ అథ్లెట్ల క్రీడా సామర్థ్యం ఏంటో ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించినందుకు ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. కశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి సుందరమైన ప్రాంతాల్లో నిర్వహించే మంచుతో కూడిన క్రీడల్లో అథ్లెట్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇది ఒక అద్భుతమైన వేదిక అని నయనశ్రీ తాళ్లూరి అన్నారు.
"నేను దక్షిణ భారతదేశ రాష్ట్రమైన తెలంగాణ నుంచి ఇక్కడకు వచ్చాను. ఇక్కడి కనిష్ఠ ఉష్ణోగ్రతలకు అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది. అయితే ఖేలో ఇండియా సిబ్బంది మాకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఏర్పాట్లు మరింత మెరుగ్గా ఉన్నాయి. ఐస్ ట్రాక్‌లను మరింత మెరుగుపర్చారు. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా"- నయన శ్రీ, క్రీడాకారిణి
పురుషుల స్కేటింగ్ విభాగంలో సత్తాచాటిన ప్రణవ్ మాధవ్ : తెలంగాణకు చెందిన ప్రణవ్ మాధవ్ ఈ వింటర్ గేమ్స్‌లో పాల్గొని సత్తా చాటారు. పురుషుల 500 మీటర్ల స్పీడ్ స్కేటింగ్ ఈవెంట్లో స్వర్ణపతకం సాధించి తన క్రీడా ప్రతిభను ప్రపంచానికి తెలియజేశాడు. ఈ సందర్భంగా '2023 గుల్మార్గ్లో జరిగిన ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో నేను 500 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాను. రజత పతకాన్ని చేజార్చుకున్నాను. 2024లో రజత పతకాన్ని గెలవాలనే నా లక్ష్యాన్ని సాధించాను. 2025లో బంగారు పతకం సాధించాలనే లక్ష్యం సాకారమైంది. ఎట్టకేలకు బంగారు పతకాన్ని గెలుచుకున్నాను. రాష్ట్రం నుంచి బంగారు పతకం సాధించినందుకు నాకు, నా కుటుంబానికి చాలా ఆనందంగా ఉంది" అని ప్రణవ్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు.